సుమారు 250 మంది చైనా సైనికులు బారీ ఆయుధాలతో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కమేంగ్ జిల్లాలోకి జూన్ 9న ప్రవేశించి సుమారు నాలుగు గంటలపాటు హడావుడి చేసిన తరువాత వెనక్కి వెళ్లిపోయారనే వార్తలు ఇవ్వాళ్ళ మీడియాలో ప్రధానంగా కనిపించాయి.
అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా చాలా కాలంగా వాదిస్తోంది. వాదించడంతోనే సరిబెట్టుకోకుండా దానిని తమ దేశంలో అంతర్భాగంగా మ్యాపులలో కూడా చూపించుకొంటోంది. దానిని ప్రపంచదేశాలకి నిరూపించి చూపేందుకే ఈ సాహసానికి పూనికొని ఉండవచ్చు. తద్వారా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తాము ఎన్నటికీ వెనక్కి తగ్గేది లేదని చైనా మరోమారు స్పష్టం చేసినట్లయింది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమని భారత ప్రభుత్వం పదేపదే చెప్పడమే కాకుండా అక్కడ తన సార్వభౌమత్వాన్ని నిరూపించుకొంటూ ఎన్నికలు జరిపిస్తూ తన అధీనంలో ఉండే ప్రభుత్వాలని చాలా కాలంగా ఏర్పాటు చేసుకొంటున్న సంగతి తెలిసిందే.
అయినప్పటికీ చైనా ఈ దుస్సాహసానికి పూనుకోవడం తెంపరితనంగానే భావించవచ్చు. భారత్ కూడా చైనాకి ధీటుగానే జవాబు చెప్పగలదు కానీ అది మరో యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందనే ఆలోచనతోనే వెనకడుగు వేస్తోంది. దానిని భారత్ అసమర్దతగా, అలుసుగా చైనా భావిస్తున్నట్లుంది అందుకే తరచూ కవ్వింపు చర్యలకి పాల్పడుతోంది. చైనా తన భూబాగాన్ని కాపాడుకోవాలనుకొంటే అది తప్పేమీ కాదు. కానీ తన సామ్రాజ్య విస్తరణ కాంక్షతో జపాన్ దగ్గర దీవులు మొదలుకొని, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈవిధంగా కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని ఎవరూ హర్షించడం లేదు.
ఒకవైపు ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే భారతదేశానికి తన వస్తువులతో ముంచెత్తుతూ కోట్లాది రూపాయలు సంపాదించుకొంటోంది. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలతో సహా దేశంలో అనేక రాష్ట్రాలు పరిశ్రమలు, పెట్టుబడుల కోసం చైనా చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తున్నాయి. అందుకు సంతోషించాలో..బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ లోకి చైనా సైనికులు చొరబడటాన్ని భారత ప్రభుత్వం ఖండిస్తూ నిరసన ప్రకటన చేయవచ్చు కానీ అటువంటి వాటిని చైనా ఖాతరు చేయదని తెలిసిన విషయమే. చైనా కవ్వింపు చర్యలకి దీటుగా బదులుచెప్పి యుద్ధాన్ని ఆహ్వానించుకోవడం కంటే, భారత్ ని ముంచెత్తుతున్న దాని ఉత్పత్తులపై కటినమైన ఆంక్షలు విధించితే గట్టిగా బుద్ధి చెప్పినట్లవుతుంది.