సమతా విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మోదీకి దగ్గరగా మసిలి తనను అవమానించారన్న కారణంగా చినజీయర్ స్వామిని కేసీఆర్ దూరం పెట్టారు . ఇప్పుడు కేసీఆర్ బీజేపీకి కూడా దగ్గరగా ఉన్నారు కాబట్టి చినజీయర్ తో దూరం అవసరం లేదనుకున్నారేమో కానీ మెల్లగా దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తోంది. జనగాంలో సెప్టెంబర్ 4న సీఎం కేసీఆర్, చిన జీయర్ స్వామి కలిసి ఓ ఆలయ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. యాదాద్రిలో ఆశ్రమ నిర్మాణానికి .. చినజీయర్ కు తాజాగా అనుమతులు ఇచ్చారు. ఇవన్నీ చినజీయర్ – కేసీఆర్ మధ్య అభిప్రాయబేధాలు తొలగిపోయినట్లేనని అంచనా వేస్తున్నారు.
కమ్యూనికేషన్ గ్యాప్ అయినా..రాజకీయ ప్రభావం అయినా కారణాలు ఏమిటనేది చెప్పుకోకపోయినా… చినజీయర్‌కు కేసీఆర్‌తో గ్యాప్ వచ్చిందనేది నిజం. ఈ విషయంలో ఇరువురూ అంగీకరించకపోవచ్చు. తాము ఎవరితోనూ రాసుకుపూసుకు తిరగబోమని… అడిగితే సలహాలిస్తాం..లేకపోలేదని చినజీయర్ అంటారు. కానీ ఆయనలోనూ కేసీఆర్ దూరమయ్యారన్న బాధ ఉంది. యాదాద్రి ఆలయ ఆలోచన కేసిఆర్‌ది కావొచ్చు కానీ ఆచరణలోకి తెచ్చింది చినజీయర్. గుట్ట ఆలయానికి ఆగమ సలహాదారు కూడా . కానీ తర్వాత కేసీఆర్ దూరం పెరగడంతో అన్నీ పోయాయి.
చినజీయర్ కు మహారాజ పోషకుడు మైహోం రామేశ్వరరావు. ఆయనను కూడా కేసీఆర్ దూరం పెట్టారని చెబుతున్నారు.. అయితే ఇప్పుడు చినజీయర్ తో కలిసి మళ్లీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున… ఆయన కూడా దగ్గరవుతారని అంచనా వేస్తున్నారు. బీజేపీ పెద్దలు ముఖ్యంగా ప్రధాని మోదీ… చినజీయర్ ను గౌరవిస్తారు. ఇది కూడా కేసీఆర్ రాజీపడటానికి ఓ కారణం అన్న వాదన వినిపిస్తోంది.