తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు చినజీయర్ స్వామి చివరి ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి కేసీఆర్‌కు వివరణ ఇస్తున్నట్లుగా మాట్లాడారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదంతా జరిగిందని శిలాఫలకం విషయంలో పొరపాటు జరిగిందని ఆయన పరోక్షంగా అంగీకరించారు. కేసీఆర్ సహకారంతోనే ఇంత పెద్ద కార్యక్రమం చేయగలిగామన్నారు. శనివారం జరగనున్న శాంతి కల్యాణం కార్యక్రమానికి సీఎంను కూడా ఆహ్వానించామని వస్తారని ఆశిస్తున్నామన్నారు.
శిలాఫలకం మీద పేరు లేకపోవడంతోనే కేసీఆర్ ఆగ్రహం చెందారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై చినజీయర్ వివరణ ఇచ్చారు. మీడియా వాళ్ల కొన్ని కలిపి రాయడం వల్ల కోతులా ఉండాల్సింది ఏనుగై కూర్చుంటుందన్నారు. ప్రధాని రావాలని నాలుగేళ్ల క్రితం నిర్ణయమైందన్నారు. మొదట సమాచారం ఇచ్చినప్పుడు ఎవరెవరు పాల్గొంటారో ముందే చెప్పడం రూల్. అందుకే పాల్గొన్నవాళ్ల పేర్లే శిలాఫలకంలో పెట్టామన్నారు. అంతే తప్ప కేసీఆర్ పేరును ఉద్దేశపూర్వకంగా శిలాఫలకంపై తొలగించడం ఏమీ లేదన్నారు. కానీ కేసీఆర్ చివరి క్షణం వరకూ హాజరవుతారే ప్రచారం జరిగింది. ఆయన హాజరవరని మోదీ ముచ్చింతల్‌కు వెళ్లిన తర్వాతే తెలిసింది.
కేసీఆర్ వస్తారనే సమతా మూర్తి ఉత్సవాల చివరి రోజున జరగాల్సిన శాంతి కల్యాణాన్ని శనివారానికి వాయిదా వేశారు. కేసీఆర్ వస్తారో లేదో ఇంత వరకూ స్పష్టత లేదు. హాజరవుతారన్న సంకేతాలు కూడా రాలేదు. ఎలాంటి సమాచారం కూడా ముచ్చింతల్‌కు అందలేదు. కేసీఆర్‌ను కూల్ చేయడానికి రామేశ్వరరావు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చినజీయర్ మీడియా మీట్ పేరుతో వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి కేసీఆర్ మనసు కరుగుతుందా ?