వాళ్లకు వాళ్లు గ్యాప్ పెట్టుకుంటే మేమేమీ చేయలేమని చినజీయర్ స్వామి తేల్చేశారు. సీఎం కేసీఆర్‌తో ఆయనకు దూరం పెరిగిందని అందుకే యాదాద్రి పునంప్రారంభోత్సవ మహాసంప్రోక్షణకు కూడా పిలవడం లేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందించారు. తాము ఎవరికీ..దగ్గరా దూరం అనేది ఉండదన్నారు. ఎవరితోనూ రాసుకుపూసుకు తిరగమన్నారు. అడిగితే సలహాలిస్తాం అంతే కానీ వాళ్లకి వాళ్లు దూరం అయితే తాము ఏమీ చేయలేమన్నారు. యాదాద్రికి పిలిస్తే వెళ్తాం లేకపోతే చూసి సంతోషిస్తామన్నారు. యాదాద్రికి ఆగమ సలహాదారుగా అధికారికంగా చినజీయర్‌కు పదవి ఉంది. కానీ ఆయనను ఈ సారి మహా సంప్రోక్షణకు పిలవడం లేదు. కలెక్టర్ పంపుతున్న ఆహ్వానపత్రాల్లో ఆయన పేరు లేదు.
సమ్మక్క – సారక్కలపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూండటంతో వివరణ కోసం ప్రెస్ మీట్ పెట్టిన ఆయన కేసీఆర్‌తో సంబంధాలపైనా మాట్లాడారు. సమ్మక్క- సారక్కలపై తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పటివి కావని.. ఇరవై ఏళ్ల కిందటివన్నారు. తాము మహిళలను ఆరాధిస్తాం కానీ కించ పర్చబోమని చినజీయర్ స్పష్టం చేశారు. అప్పటి వీడియోలో తాను ఏం మాట్లాడానో కాకుండా.. తాత్పర్యం తీసుకోవాలని విమర్శకులకు సలహా ఇచ్చారు. తెలంగాణ సమాజం మొత్తం క్షమాపణలు కోరుతూండటంతో ఆయన క్షమాపణలు చెుబతారని అనుకున్నారు. కానీ ఆయన రాజకీయ నాయకుడి తరహాలో తాను అన్న మాటలకు అర్థాలు వేరని.. తాత్పర్యం చూడాలని సలహా ఇచ్చారు.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధ వార్తలు తగ్గిపోవడంతో.. తన వీడియోను బయటకు తీసి ప్రచారం చేస్తున్నారని .. కావాలనే చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేయడం ఎంత మంచిదో వారి వివేకానికే వదిలేస్తున్నాన్నారు. తాము భిక్ష సాధువునని స్పష్టం చేశారు. తనకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదన్నారు. రాజకీయాలకు దూరమన్నారు. సమతామూర్తి విగ్రహం పేరుతో వ్యాపారం చేస్తున్నారని వస్తున్న విమర్శలపైనా స్పందించారు. టిక్కెట్ పెట్టింది నిర్వహణ కోసమేననన్నారు.
మొత్తంగా చినజీయర్‌కు ఏదీ కలసి రావడం లేదు. ఓ వైపు కేసీఆర్ నిరాదరణ.. మరో వైపు వరుస వివాదాలతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తనను తాను సమర్థించుకోలేకపోతున్నారు.