చినజీయర్ స్వామికి కేసుల చిక్కులూ ఎదురొస్తున్నాయి. ఆయన భక్తులకు అమ్మే ప్రసాదంలో అవకతవకలు జరుగుతున్నాయని ఓ భక్తుడు ఫిర్యాదు చేయగానే.. పోలీసులు సమతామూర్తి నిర్వాహకులుపై కేసులు నమోదు చేశారు. వినయ్ వంగాల అనే వ్యక్తి సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. అక్కడ విక్రయించే ప్రసాదం ప్యాకేట్ కొనుగోలు చేశారు. దానిపై ప్రసాదం తయారు తేదీ, కాల పరిమితిని ముద్రించలేదు. అంతే కాక ప్యాకెట్‌పై పేర్కొన్న బరువుకు అందులో ఉన్న బరువు కూడా తేడా ఉంది.
ఈ అవకతవకలకపై అక్కడ ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. కానీ వాళ్లు ఎవరు స్పందించకపోవటంతో వెంటనే తూనికలు కొలతలు అధికారులకు మేయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని మొత్తం తనిఖీ చేశారు. మెట్రాలజీ యాక్ట్ 2009 సెక్షన్లు 10,11,12, అండ్ 8/25 రూల్స్‌ను బ్రేక్ చేసినందుకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీపై కేసు నమోదు చేశారని వినయ్ వంగాల తెలిపారు.
మామూలుగా అయితే భక్తులు కానీ.. ప్రభుత్వం కానీ ఇలాంటి వాటిని చూసీ చూడకుండా పోతుంది. ఇంత చిన్న విషయానికి నేరుగా సమతామూర్తి నిర్వాహకులపై కేసులు పెట్టే వరకూ వెళ్లరు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వినయ్ వంగాల అనే వ్యక్తి కూడా అక్కడ లోపాలు వెదకడానికే వెళ్లినట్లుగా ఉంది. ఆయన పిలవడం.. వెంటనే అధికారులు వచ్చి కేసులు నమోదు చేయడంతో ఇది సాధారణంగా జరిగింది కాదన్న అభిప్రాయం ఎక్కువ మందికి వస్తోంది.