కేసీఆర్కు ఎప్పుడూ అనుగ్రహం ప్రసాదించే చినజీయర్.. స్వయంగా ఆయన అనుగ్రహం పోగొట్టుకున్న తర్వాత వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటి వరకూ చాలా సార్లు కాంట్రావర్శియల్గా మాట్లాడినా ఆయనపై నోరెత్తడానికి చాలామంది వెనుకంజ వేశారు. కానీ ఇప్పుడు ఎప్పుడో జమానా కింద మాట్లాడిన వీడియోను తీసుకొచ్చిన ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయనపై విమర్శలే కనిపిస్తున్నాయి.
అప్పుడెప్పుడో మా టీవీలో ప్రవచనలు చెప్పే సమయంలో ఆయన సమ్మక్క – సారక్క జాతర గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లేమైనా దేవతలా..? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవాళ్లా..? ఏమిటి చరిత్ర..? ఏదో ఒక అడవి దేవత… గ్రామదేవత… అక్కడుండేవాళ్లు చేసుకోనీ, సరే… చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు… ఆ పేరిట బ్యాంకులే పెట్టేశారండీ ఇప్పుడు… అది వ్యాపారమైపోయింది ఇప్పుడు… ఎంత అన్యాయం..? అది ఒక చెడు… కావాలనే దీన్ని వ్యాపింపజేస్తున్నారు సమాజంలో…’’ అంటున్న వీడియో వైరల్ అయిపోయింది.
వెంటనే ఆయనకు వ్యతిరేకంగా పెద్దపెద్ద ప్రకటనలు ప్రారంభమయ్యాయి. గిరిజన దేవతల్నిఅవమానించారని ఎమ్మెల్యే సీతక్క దగ్గర్నుంచి అందరూ విమర్శించడం ప్రారంభించారు. ఆయన సమతా మూర్తి ని పూజించడానికి ఎలా అర్హుడని ప్రశ్నిస్తున్నారు. ఆయన రియల్ఎస్టేట్ సామ్రాజ్యాన్ని కూల్చేయాలని సీపీఐ నారాయణ లాంటివారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంఇప్పటికే ప్రారంభమయింది. ఎక్కడదాకావెళ్తుందో అంచనా వేయడం కష్టమే. ఎందుకంటే.. . ఇప్పుడు ఆయనకు అధికార సపోర్ట్ లేదు మరి.