తెలుగు360.కామ్ రేటింగ్ :2.25/5
గోడకు వేళాడుతున్న గ్రూప్ ఫొటోలు చూడ్డానికి ఎంత బాగుంటాయో.
అమ్మానాన్న, అత్త, మావ, పిన్ని, బాబాయ్, వాళ్ల పిల్లలు. అమ్మమ్మ – తాతయ్య వీళ్లందరినీ ఒకే ఫ్రేములో చూడ్డానికి ముచ్చటగా అనిపిస్తుంది. అయితే ఈ గ్రూప్ ఫొటోని సెట్ చేయడానికే తల ప్రాణం తోకకు వస్తుంది. ఫొటో దిగే సమయంలో అందరూ లేకపోవొచ్చు. ఉన్నా ఫొటో తీసుకునే మూడ్ వీళ్లకు లేకపోవొచ్చు. బాబాయ్ పక్కన మావయ్యకు నిలబడడం ఇష్టం లేకపోవొచ్చు. పిన్ని లేదని పెద్దమ్మ అలిగి వెళ్లిపోవొచ్చు. అన్నీ కుదిరితే ఆ సమయానికి కెమెరా అందుబాటులో లేకపోవొచ్చు. ఒక్క ఫొటోకే ఇన్ని ఇబ్బందులు ఉంటే.. ఇక అంతమంది ఉండే కుటుంబంలో ఇంకెన్ని గొడవలు, చిరు కోపాలు ఉంటాయో ఊహించుకోండి. ఫ్యామిలీ అంటేనే అంత. ఆ ఎమోషన్‌నీ, రిలేషన్‌ని అనుభవించాల్సిందే. అందుకే ఎక్కడ జనం గుంపుగా కనిపించినా ఫ్రేము అందంగా కనిపిస్తుంది. అందులో మన అక్కనో, చెల్లెనో, బావనో, మరదలినో చూసుకుంటుంటాం. కుటుంబ నేపథ్యంలో ఉన్న కథలు ఎక్కువగా రావడానికి, అవి విజయవంతమవ్వడానికి కారణం అదే. `చినబాబు` కూడా అలాంటి కథే. పాండిరాజ్‌కి హృద్యమైన కథలు తీస్తాడని పేరుంది. ఆయన ఫోకస్ ఈసారి ఉమ్మడిక కుటుంబంపై పడింది.
కథ
అయిదుగురు అక్కల తరవాత పుట్టిన ముద్దుల తమ్ముడు చినబాబు (కార్తి). నాన్న (సత్యరాజ్) కుటుంబ బాధ్యతల్ని కూడా చినబాబుపైనే వేసేస్తాడు. ఓ అక్క ఇంట్లో ఏదైనా శుభ కార్యం జరిగిందంటే… చినబాబే ముందుంటాడు.అక్కల్ని, బావల్ని, వాళ్ల పిల్లల్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. తనకి ఇద్దరు మేనకోడళ్లు. అక్కడే అసలు సమస్య, ఒకరిని చేసుకుంటే మరొకరికి కోపం. తన కుటుంబంలోనే రెండు గ్రూపులుంటాయి. రెండు గ్రూపుల్నీ సంతృప్తి పరచడం చాలా కష్టం. ఎందుకొచ్చిన గొడవ అనుకుని నీల (సయేషా సైగల్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమతోనే చిక్కులు మొదలవుతాయి. `చేసుకుంటే మనింటి పిల్లని చేసుకో` అంటూ అక్కలంతా తిరుగుబాటు బావుటా ఎగరేస్తారు. బావలు మొహం చాటేస్తారు. పచ్చగా ఉండే ఆ కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. ‘ఈ ఇంట్లో ఒక్కరిని కూడా నొప్పించకుండా పెళ్లి చేసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని నాన్న షరతు విధిస్తాడు. మరి చినబాబు ఏం చేశాడు? ఈ కుటుంబాన్ని తన పెళ్లి విషయంలో ఒక్క తాటిపై ఎలా తీసుకొచ్చాడు? అనేదే కథ.
విశ్లేషణ
ముందు నుంచీ ఈ సినిమాపై `రైతు కథ` అనే ఫోకస్ పడింది. పాండిరాజ్‌కి సామాజిక అంశాలంటే ఆసక్తి ఎక్కువ. అందుకే… రైతుల గురించి, వాళ్ల కష్టాల గురించీ, కన్నీళ్ల గురించి లెక్చర్లు ఇస్తాడేమో అనుకున్నారంతా. కానీ… ఈ విషయాన్ని చాలా తెలివిగా డీల్ చేశాడు. రైతుల గొప్పదనం చెబుతూనే తెలివిగా ఆ పాయింట్‌ని కథలో అంతర్లీనంగా, చెప్పీ చెప్పకుండా చేశాడు. నిజానికి ఇది ఓ హమ్ ఆప్ కే హై కౌన్లాంటి సినిమా. చుట్టూ జనం.. మధ్యలో మనం అనే కాన్సెప్టు. హీరోకి కుటుంబం అంటే ఇష్టం. తన పెళ్లి వల్ల కుటుంబం విచ్ఛిన్నం అవ్వకూడదని తాపత్రయపడుతుంటాడు. చినబాబు పెళ్లి కబురు వల్ల… ఆ కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. చినబాబు పెళ్లితోనే అంతా మళ్లీ కలుస్తారు. ఈ మధ్యలో ఏం జరిగిందనేదే మిగిలిన కథ. ఓ ఉమ్మడి కుటుంబం మధ్యలో కూర్చుని పాండిరాజ్ ఈ కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. మనింట్లో జరిగే పెళ్లిళ్లలోనూ, పేరంటాళ్లలోనూ కనిపించే సర్వసాధారణమైన సన్నివేశాలు తెరపైకి తీసుకొచ్చేశాడు. పెద్ద అక్క ఇంట్లో శుభకార్యానికి పది కాసుల బంగారం చేయించిన తమ్ముడు… చిన్నక్క విషయానికి వచ్చేసరికి అది ఎనిమిది కాసులకు పడిపోతే… వాళ్ల మధ్య అలకలు ఎలా మొదలవుతాయో.. సరిగ్గా అవే సన్నివేశాల్ని రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. దాంతో మనింట్లో జరిగే తతంగాన్నే మళ్లీ వెండి తెరపై చూసుకున్నట్టు అనిపిస్తుంది. పాండిరాజ్ బలం… వినోదం. సన్నివేశంలోంచి, పాత్రల లోంచి, వాళ్ల క్యారెక్టరైజేషన్ల నుంచి వినోదం పండించాడు. ఆ సన్నివేశాలన్నీ అత్యంత సహజంగా అనిపిస్తాయి. సీరియెస్‌గా కనిపించే సీన్ లోంచి హాస్యం పుట్టించడానికి దర్శకుడికి, రచయితకు సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. అది పాండిరాజ్లో కనిపించింది. అందుకే చాలా సన్నివేశాలు నవ్వులు పండించాయి.
కార్తి ఇమేజ్‌కీ, మాస్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఈ కథలో యాక్షన్ ఎపిసోడ్‌నీ మిక్స్ చేశాడు దర్శకుడు. నిజానికి ఆ యాక్షన్ సీన్లనీ, విలన్ని పూర్తిగా పక్కన పెట్టి… దీన్నో కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా మలచవచ్చు. కానీ.. పాండిరాజ్ మాత్రం ఆ ధైర్యం చేయలేదు. పైగా తమిళ నేటివిటీ నిండిపోయిన సినిమా ఇది. ఎక్కడ చూసినా ఆ మొహాలే. టైమ్ లేకపోవడం వల్లో ఏమో, కొన్ని తమిళ బోర్డుల్ని అలానే ఉంచేశారు. దాంతో తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ అడుగడుగునా కనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఆ సెంటిమెంట్ అంతా.. తమిళ ఘాటే. వాటిని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకూ రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
నటీనటులు
కార్తి లాంటి నటుడిలో తప్పులు వెదకడం కష్టం. తనకు సరైన పాత్ర పడితే అందులో పూర్తి స్థాయిలో విజృంభిస్తాడు. చినబాబు విషయంలోనూ ఇదే జరిగింది. అన్ని కోణాల్లోనూ కార్తి రాణించాడు. కార్తి తో పాటు దాదాపుగా ప్రతీ ఫ్రేములోనూ కనిపించాడు సూరి. తన డైలాగులు, ఇచ్చిన కౌంటర్లు థియేటర్లో నవ్వులు పంచాయి. బాలు గొంతు సత్యరాజ్ నోటి నుంచి వినడానికి ముందు కాస్త ఇబ్బంది పడినా.. తర్వాతర్వాత సెట్ అయిపోయింది. సత్యరాజ్ పాత్ర హుందాగా సాగింది. అనవసరమైన మెలోడ్రామా జోలికి పోకుండా ఆ పాత్రని ఎంత వరకూ వాడుకోవాలో అంతే వాడుకున్నాడు. `అఖిల్`లో చూసింది ఈ అమ్మాయినేనా? అనిపిస్తుంది సాయేషాని చూస్తుంటే. గ్లామర్ పరంగా, నటన పరంగా చాలా సహజంగా కనిపించింది.
సాంకేతిక వర్గం
కొత్త కథేం కాకపోయినా పాండిరాజ్ స్క్రిప్టుని చక్కగా రాసుకున్నాడు. అన్ని రకాల ఎమోషన్స్ జోడిస్తూ… ఓ ఫ్యామిలీ డ్రామాని తెరపైకి తీసుకొచ్చాడు.రైతులు గొప్పదనం చెప్పేటప్పుడు సంభాషణలు మెరిశాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌నీ చక్కగా రాసుకున్నాడు. పల్లెటూరి వాతావరణాన్ని కెమెరా బాగా చూపించింది. పాటల్లో, ఫైట్లలో భారీదనం ఏమీ లేదు. విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సన్నివేశాలు కూడా సాధారణంగా ఉన్నాయి.
తీర్పు
కుటుంబ నేపథ్యంలో సాగే ఈ కథకు ఏం చేయాలో అవన్నీ చేశాడు పాండిరాజ్. తమిళ ప్రేక్షకులకు, అక్కడి కార్తి అభిమానులకూ ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. నెటివిటీని మర్చిపోగలిగితే.. మనవాళ్లూ బాగానే ఎంజాయ్ చేస్తారు. పాటల్లో, సన్నివేశాల చిత్రీకరణలో అరవ వాసన బాగా కొడుతోంది. అది తెలుగు ప్రేక్షకులకు కాస్త ఇబ్బందే.
ఫినిషింగ్ టచ్: చినబాబు.. ‘చిల్’బాబూ..!
తెలుగు360.కామ్ రేటింగ్ :2.25/5