ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులే. అయితే ఈ దాడుల నేపథ్యంలో చిన్న జీయర్ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఇవాళ ఆదోనిలో ఆయన మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్న అనుమానాలు కలిగించాయి. వివరాల్లోకి వెళితే..
దళితులకు ఆలయంలోకి ప్రవేశం లేకపోవడం పై తప్పు అంతా బ్రిటిష్ వారిదే అన్నట్లు చిన్న జీయర్ వ్యాఖ్యలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాల పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, ఆలయాలను పరిరక్షించుకోవడానికి చిన్న జీయర్ స్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆలయాల పై దాడులు చేస్తున్నది ఎవరు అన్న సంగతి పాలకులే తేల్చాలి అంటూ పాలకులపై ఒత్తిడి పెంచారు. అదేవిధంగా హిందూ ఆలయాల పరిరక్షణ బాధ్యత అర్చకులు, ధర్మ కర్తలు, భక్తులతో పాటు ప్రతి ఒక్కరిది అంటూ ఆయన సూచించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఆయన కొనసాగిస్తూ, దళితులకు ఆలయాల్లో ప్రవేశం లేదు అన్నది కేవలం రాజకీయ స్లోగన్ మాత్రమే అని, అటువంటి సంప్రదాయం హిందూమతంలో లేదు అని, బ్రిటిష్ వారు దీనిని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారని వ్యాఖ్యలు చేశారు.
అదే కనుక నిజమైతే, వైకోం సత్యాగ్రహం, అరవీపురం ఉద్యమం, పెరియార్ పోరాటం, నారాయణ గురు ఉద్యమం దేనికి?
అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు విన్నవారికి ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నారనే అభిప్రాయం కలిగిస్తున్నాయి. ఉదాహరణకు తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి నాయకర్, కేరళకు చెందిన నారాయణ గురు లాంటి వారు హిందూ ఆలయాలలో కి దళితుల ప్రవేశం కోసం పోరాడి ఆ రోజుల్లోనే జైలుపాలైన సంగతి అందరికీ తెలిసిందే. వైకోం సత్యాగ్రహ ఉద్యమం ట్రావెన్కోర్ ప్రాంతంలో దళితులను ఆలయాలలో కి ప్రవేశించడం కోసం మాత్రమే కాకుండా ప్రజలలో జాతీయత భావాలను పెంపొందించడానికి కూడా ఆ రోజుల్లో తోడ్పడిన సంగతి చిన్న జీయర్ వంటి వారికి నిజంగానే తెలియదా లేక తెలిసినప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అన్నది తెలియడం లేదు. అలాగే, నారాయణ గురు వంటి వారు ప్రాణాల కి తెగించి చేసిన అరవీపురం ఉద్యమం వంటి పోరాటాలు ఫలించి కొన్ని ప్రాంతాలలో దళితులకు దేవాలయాల లోకి ప్రవేశం 1920ల లో నే కల్పించినప్పటికీ, అనేక ప్రాంతాలలో 1930 లలో కూడా దళితులకు హిందూ దేవాలయాల్లో కి మాత్రమే కాకుండా కొన్ని చోట్ల దేవాలయం వైపు దారి తీసే రోడ్లపైకి కూడా ప్రవేశం ఉండేది కాదు. ఆ తర్వాత 1930 లలో కమ్యూనల్ అవార్డు సందర్భంగా గాంధీ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆ దీక్షకు చలించిన భారతీయులు అనేకచోట్ల దళితుల కోసం ఆలయాలను తెరిచారు. గాంధీ సహా అనేకమంది నాయకులు దళితులకు ఆలయంలోకి ప్రవేశం కోసం చేసిన ప్రయత్నాల కారణంగా దళితులకు ఆలయంలోకి ప్రవేశం అనేది లభించింది.
బ్రిటిష్ వారు దళితులకు ద్రోహం చేశారా?
అయితే అప్పటికీ కొన్ని చోట్ల స్వాతంత్రానికి పూర్వం దళితులకు ఆలయాల్లో కి ప్రవేశం ఉండేది కాదు. 1950 లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 14 ,ఆర్టికల్ 15 లు పౌరులందరికీ సమానత్వం ప్రసాదించిన తరువాత మాత్రమే దేవాలయాల లోకి దళితులకు ప్రవేశం పూర్తి స్థాయిలో లభించింది. ఇంత చరిత్ర మన కళ్లముందే కనిపిస్తున్నప్పటికీ నెపాన్ని పూర్తిగా బ్రిటీష్ వారిపై నెట్టివేయడానికి చినజీయర్ స్వామి వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు చరిత్ర తెలిసిన వారిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిజానికి, బ్రిటిష్ వారు తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే అయినప్పటికీ, దళితులకు ఎంతో కొంత మేలే చేశారు. ఆ కారణంగానే, అంబేద్కర్ జ్యోతిబాపూలే వంటి వారు సైతం కొన్ని సందర్భాలలో బ్రిటిష్ నిర్ణయాలకు మద్దతు పలికారు. అయితే ఇవాళ నారాయణ గురు పెరియార్ వంటి పోరాటాలు, బ్రిటిష్ నిర్ణయాలు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, వీటన్నింటి కారణంగా దళితులు కూడా హిందూ మతంలో అంతర్భాగం అయిపోయారు. అనేక రంగాల్లో మిగతా వారితో సమానంగా రాణిస్తున్నారు.
ఏది ఏమైనా, మనకు తెలిసిన చరిత్రే, మన కళ్ళముందే వక్రీకరించబడడం, దానికి కొన్ని మీడియా వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారింది.
-Zuran