వైసీపీ నేతలు చంద్రబాబును హైదరాబాద్‌లో ఉండి విమర్శలు చేస్తున్నారని.. ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోవడం లేదని.. మండిపడుతున్నారు. ఏపీకి వచ్చి చూసి.. క్వారంటైన్ సెంటర్లను పరిశీలించి… బాధితులకు ధైర్యం చెప్పాలని అంటున్నారు. అదే సమయంలో.. ఏపీకి వస్తే.. క్వారెంటైన్‌కు తరలిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ రాజకీయ విమర్శలు ఇలా ఉంటే… చంద్రబాబు.. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నారని.. కానీ ముఖ్యమంత్రిగా ఉండి.. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఎందుకు బయటకు రావడంలేదని.. టీడీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబును లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్రజల్లోకి రావాలంటున్న మంత్రులు… ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఇంటికే పరిమితం కావడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలని.. అప్పుడే వారి కష్టాలు తెలుస్తాయని… పరిష్కార మార్గం చూపించగలుగుతారని.. మాజీ హోంమంత్రి చినరాజప్ప అంటున్నారు. కరోనా కలకలం ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క సారి కూడా క్షేత్ర స్థాయి పర్యటన చేయలేదు. రోజూ…. క్యాంప్ ఆఫీసులో ఓ సారి సమీక్ష చేస్తున్నారు. టెస్ట్ కిట్లు ఏమైనా వస్తే ప్రారంభోత్సవం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి.. మాత్రం… హైదరబాద్‌తో పాటు.. ఏపీలోని అన్ని జిల్లాలు తిరిగేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. మంత్రులు కూడా ఆయనతో పాటు తిరుగుతున్నారు. కానీ సీఎం మాత్రం ఇంట్లో నుంచి బయటకు రాలేదు.
పశ్చిమబెంగాల్, కేరళ లాంటి ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని ఎక్కడిక్కడ పరిష్కారం చూపుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ పోలిక ప్రారంభమయింది. యువ ముఖ్యమంత్రి అయి ఉండి.. జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం కావడం ఏమిటని..ఈ కష్ట కాలంలో ప్రజల్లోకి వచ్చి.. వారి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబును పదే పదే ప్రజల్లోకి రావాలన్న డిమాండ్ ను వైసీపీ నేతలు వినిపిస్తూండటంతో.. అసలు ఆ బాధ్యత తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు ఇంటికే పరిమితమవుతున్నారని ఎదురుదాడి ప్రారంభిస్తున్నారు.