ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మార్చే విషయంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ..పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన తర్వాత ఏపీలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. కొత్తగా రాజధాని ఎక్కడ పెట్టాలో.. డిమాండ్లు ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో.. చాలా మంది.. రాజధాని మార్పుపై.. స్పష్టమైన సమాచారం ఉందని… కూడా ప్రకటనలు చేసేస్తున్నారు. తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్… ఏపీ రాజధానిని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొనకొండకు మార్చబోతున్నారని.. తనకు స్పష్టమైన సమాచారం ఉందని ప్రకటించారు. ఈ మేరకు.. కేంద్ర ప్రభుత్వానికీ .. జగన్ సమాచారం ఇచ్చారని… ప్రకటించారు. కేంద్ర పెద్దల అనుమతితో.. దొనకొండకు… రాజధానిని మార్చే ఆలోచన జగన్ చేస్తున్నారని తేల్చారు. అయితే.. రవాణా పరంగా.. మౌలిక సదుపాయాల పరంగా ఎలాంటి సౌకర్యాలు లేని.. దొనకొండ కంటే.. తిరుపతికొండ రాజధానిగా అద్భుతంగా ఉంటుందని… చింతా మోహన్ చెప్పుకొస్తున్నారు. ఏపీలో రాజధానికి అనువైన ప్రాంతం తిరుపతి ఒక్కటేనని చెబుతున్నారు.
మరో వైపు … తెలుగుదేశం పార్టీ నేతలు… అమరావతి మార్పు ప్రకటనపై ఎగ్రెసివ్ గా స్పందిస్తున్నారు. ఓ సామాజికవర్గాన్ని దెబ్బతీయడానికే… జగన్మోహన్ రెడ్డి కృష్ణా, గుంటూరు జిల్లాలపై వివక్ష చూపిస్తున్నారని… టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. రాజధానిని అమరావతి నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు కుట్ర జరిగిందని… ఇందు కోసం కేసీఆర్, నరసింహన్ సాయం జగన్ తీసుకుంటున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. సీఎం జగన్ నోటి వెంట ఎప్పుడూ అమరావతి పేరే రాలేదని …ఏరు దాటాక తెప్ప తగిలేసిన చందంగా జగన్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. రాజధానికి నిధులు వద్దని ఢిల్లీలోనూ సీఎం జగన్ చెప్పారని… గుర్తు చేశారు. గుంటూరు, కృష్ణా ప్రజలపై జగన్ కక్ష ఎందుకని ప్రశ్నించారు. మరో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు రాజధానిని తరలించాలని చూస్తే.. ప్రాణాలొడ్డి పోరాడుతామని హెచ్చరించారు.
మంత్రి హోదాలో బొత్స చేసిన ప్రకటనపై… ఇంత వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా.. ప్రభుత్వం నుంచి రాలేదు. ఈ విషయంపై ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్న మాట నిజమేనని వైసీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. బొత్స .. ప్రకటన అన్యాపదేశంగా అన్నది కాదని… ప్రజల స్పందన తెలుసుకోవడానికే… వ్యూహాత్మకంగా చేశారని అంటున్నారు. మొత్తానికి.. బొత్స ప్రకటన తర్వాత ప్రజా స్పందనను బట్టే ప్రభుత్వం ముందడుగు వేయబోతోందన్న ప్రచారం జరుగుతోంది.