గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయిన తర్వాత కూడా.. ఆ పార్టీ మరింతగా పరువు పోగొట్టుకోవడానికి తమ వంతు కృషిచేసిన సీనియర్ నాయకులు కొందరు ఉన్నారు. పార్టీ గెలిచే అవకాశం లేదని ఖచ్చితంగా తెలిసినా, ఏదో చేసేసేట్లుగా ఢిల్లీలో చక్రం తిప్పి తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని దింపి, కాంగ్రెసుకు ఈ రాష్ట్రంలో ఎప్పటికీ డిపాజిట్లు దక్కవని మరోమారు నిరూపించిన మాజీ ఎంపీ చింతామోహన్ వారిలో ఒకరు. సాధారణంగా అయితే ఎంపీగా గెలిచిన తర్వాత మళ్లీ ఎన్నికల వేళ వరకు తిరుపతిలో కనిపించని ఈ నాయకుడు, ప్రస్తుతం ఎంపీ పదవి లేదుగనుక, ఢిల్లీలో పార్టీ కూడా అధికారంలో లేదుగనుక.. తరచూ జనం ముందు తిరుగుతున్నారు. రెండు రోజుల కిందటే కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే.. జగన్ ను పార్టీలోకి తీసుకువచ్చి నాయకత్వం ఇవ్వాలని ఓ డైలాగు రువ్విన చింతా మోహన్ తాజాగా, మరింతగా జగన్కు చిడతలు వాయించడం విశేషం.
తిరుపతిలో జగ్జీవన్ కార్యక్రమంలో ప్రసంగాన్ని ఆయన జగన్ భజనకు వాడుకోవడమే ప్రత్యేకత. ఎలాంటి పదవులు లేకుండా తన వ్యాపార మేధస్సుతో ఆస్తులు సంపాదించిన జగన్ మీద సీబీఐ విచారణ చేయడం సరికాదంటూ చింతామోహన్ కితాబులివ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఏదో జగన్ మానాన జగన్ తన తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఓర్వలేక సీబీఐ కేసులు పెట్టి.. ఆయన వ్యాపార ప్రస్థానాన్ని తొక్కేస్తున్నారన్నట్లుగా ఉన్న చింతా డైలాగులు పలువురికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
ఈ పరిణామాలు గమనిస్తోంటే.. చింతామోహన్ వైకాపాలో చేరడానికి సిగ్నల్స్ పంపుతున్నారా అనిపిస్తోంది. తిరుపతి నియోజకవర్గం తప్ప.. తనకు మరో గత్యంతరం లేని ఈ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉండబోదని ఒక క్లారిటీకి వచ్చినట్లుంది. అయితే గత ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో వైకాపా గెలిచింది. తన నియోజకవర్గం పరిధిలో వైకాపాకే ప్రాభవం ఉన్నది గనుక.. ఆ పంచన చేరి, జగన్ ఆశ్రయంలో బతుకు వెళ్లదీస్తూ ఉంటే.. భవిష్యత్తులో ఎన్నికల వేళకు మళ్లీ ఏదైనా మాయోపాయం చేసి ఎంపీ కావచ్చునని ఆయన కలగంటున్నట్లుగా ఉంది. అయితే తన పార్టీ సిటింగ్ ఎంపీ ఉన్న చోట.. తనకంటూ సొంత బలం పెద్దగా లేని.. ఇలాంటి వృద్ధ నాయకుడు వస్తానన్నా సరే.. జగన్ ఆదరిస్తాడా లేదా.. తనను పొగిడించుకుని అక్కడితో సంతృప్తిపడి ఊరుకుంటాడా? అనేది వేచిచూడాలి.