జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పవన్ కల్యాణ్‌కు.. ఆ పార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. జనసేనలో కీలకంగా పని చేస్తున్న చింతల పార్థసారధి అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి చింతల పార్థసారధి పోటీ చేశారు. కొద్ది రోజుల క్రితం.. పవన్ కల్యాణ్ నియమించిన కమిటీల్లో.. చింతల పార్థసారధికి ప్రాధాన్య ఇచ్చారు. ప్రస్తుతం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ చైర్మన్ గా ఉన్నారు. మీడియా చర్చల్లోనూ యాక్టివ్‌గా పాల్గొనే చింతల పార్ధసారధికి మంచి విషయ పరిజ్ఞానం ఉంది. అయితే హఠాత్తుగా ఎందుకు జనసేనకు రాజీనామా చేశారన్నదానిపై జనసేనలోనే రకరకాల ప్రచారం జరుగుతోంది.
కమిటీలు వేసినప్పటికీ.. పెద్దగా కార్యాచరణ లేదని.. పవన్ కల్యాణ్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తిలో చింతల పార్థసారధి ఉన్నారని అంటున్నారు. అది మాత్రమే కాకుండా… జనసేన పార్టీలో ఓ మాదిరి వాయిస్ ఉన్న నేతలను అయినా సరే.. ఆకర్షించే ప్రయత్నంలో అధికార పార్టీ ఉంది. ఇప్పటికే పలువురితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో… చింతల పార్థసారధితోనూ… వైసీపీ నేతలు చర్చలు జరిపారని.. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారని కూడా అంటున్నారు. ఈ విషయంపై.. వైసీపీ నేతలు కానీ.. ఇటు చింతల పార్ధసారధి కానీ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.
అయితే.. ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశంతోనే చింతల పార్థసారధి జనసేనకు రాజీనామా చేశారన్న విషయంపై మాత్రం.. ఆ పార్టీ వర్గాలకు క్లారిటీ ఉంది. కారణం ఏదైతేనేం… ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేనను పలువురు కీలక నేతలు వదిలి పెట్టారు. ఫలితాలు రాక ముందు.. ఇద్దరు కీలక అధికార ప్రతినిధులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు. జనసేన తరపున పోటీ చేసిన నేతలపై ఇతర పార్టీలు కన్నేయడంతో.. జనసేనకు టెన్షన్ తప్పడం లేదు. బీజేపీ కూడా.. జనసేన నేతలను చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది.