దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు జైల్లోనే ఉంచాలని నిర్ణయించినట్లుగా ఉన్నారు. ఆయనపై వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై … పద్నాలుగు రోజుల రిమాండ్ విధించేలా.. కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నారు. సెప్టెంబర్ పదో తేదీన చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. కులం పేరతో దూషించారని.. వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ అరెస్ట్ చేశారు. అయితే.. ఆ ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్న ముగ్గురిలో ఇద్దరు.. తమను చింతమనేని ఏమీ అనలేదని… మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. దీంతో పోలీసులు వ్యూహం మార్చి.. వేరే కేసులో అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. అప్పట్నుంచి.. అటు రిమాండ్ ముగియడం.. ఇటు వేరే కేసులో అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించడం.. రివాజుగా మారింది. బుధవారం కోడి పందేల కేసులో చింతమనేని అరెస్ట్ చేశామని.. రిమాండ్‌కు పంపామని పోలీసులు తాజాగా ప్రకటించారు.
చింతమనేని ప్రభాకర్ ది మొదటి నుంచి వివాదాస్పద వ్యవహారశైలి. ఆయనపై మొదట్లో రౌడీ షీట్ ఉండేది. దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన దూకుడు మరింత ఎక్కువ అయింది. ఆయన ప్రజలకు మంచి చేస్తారనే పేరు ఉన్నా… దూకుడైన వ్యక్తిత్వం కారణంగా.. తిట్లు, దాడుల ఆరోపణలు వచ్చాయి. అనేక మంది ఫిర్యాదులు చేశారు. పలువురిపై దాడి చేశారని ఫిర్యాదులు వచ్చాయి. అయితే… మొదటి సారి ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా.. తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నా.. ఆయన అరెస్ట్ కాలేదు. ఓ సారి అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ పై బహిరంగంగా దాడి చేశారు. ఈ ఘటనలోనూ ఆయన అరెస్ట్ కాలేదు కానీ..విచారణలో దోషిగా నిరూపితమయ్యారు. శిక్ష కూడా పడింది. పైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
దెందులూరులో చింతమనేని.. ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో ఆయనకు గడ్డు కాలం ప్రారంభమయింది. పాత ఫిర్యాదులు.. కేసులన్నింటినీ పోలీసులు బయటకు తీసి.. అరెస్టులు చేస్తున్నారు. మామూలుగా అయితే.. చాలా వరకూ స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు. ఒక సారి దొరికితే.. అన్ని కేసుల్లోనూ అరెస్ట్ చూపే అవకాశం ఉంది. కానీ పోలీసులు మాత్రం వ్యూహాత్మకంగా.. ఒకదారినిలో రిమాండ్ పూర్తయ్యే ముందు.. మరో కేసులో అరెస్ట్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. దాంతో చింతమనేనిని మరి కొన్ని నెలలు జైలులోనే ఉండే అవకాశం ఉంది. మరో వైపు ప్రభుత్వం చింతమనేనిని వేధిస్తూందంటూ… టీడీపీ నేతలు.. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.