జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సవాల్ చేశారు. “నీ మీద గెలిచి అసెంబ్లీ వస్తా.. పోటీకి సిద్ధమా” అని చాలెంజ్ చేశారు. రాజకీయ నాయకుడిగా.. పవన్‌ను.. తనను పక్కన పెడితే ప్రజలు తననే ఎన్నుకుంటారని తేల్చి చెప్పారు. పోరాటయాత్ర లో భాగంగా నిన్న.. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో.. ప్రసంగించిన పవన్ కల్యాణ్.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. గంట సేపు ప్రసంగించి.. పూర్తిగా..చింతమనేనేని విమర్శించారు. చింతమనేనిని ఆకు రౌడీ అనడం దగ్గర ప్రారంభించి హిట్లర్ వరకూ తీసుకెళ్లారు. తనపై చేసిన విమర్శలకు .. చింతమనేని ఈ రోజు కౌంటర్ ఇచ్చారు. పవన్ విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు.
తనపై 37 కేసులు ఉన్నాయని… పవన్ కల్యాణ్ చెప్పడాన్ని ఖండించారు. తనపై మూడు కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. తనపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై బహిరంగచర్చకు రావాలని సవాల్ చేశారు. పవన్ కల్యాణ్ తనతో పాటు.. త్రిసభ్య కమిటీని తెచ్చుకోవచ్చని.. ప్రతి ఆరోపణకు.. తాను సమాధానం ఇస్తానని.. తప్పు చేశానని నిరూపించాలని సవాల్ చేశారు. చావో..రేవో దెందులూరులో చూసుకుందాం .. రమ్మని సవాల్ చేశారు. మహిళలు, దివ్యాంగులపై దాడి చేసినట్లు పవన్ చెబుతున్నారని.. నిరూపించాలని సవాల్ చేశారు. ఆధారాలు లేకుండా.. ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తినని నిరూపిస్తే.. రాజకీయాలను తప్పుకుంటానని ప్రకటించారు. పవన్ చేసిన విమర్శలపై మాత్రమే కాదు.. పవన్ రాజకీయ అడుగులుపైనా చింతమనేని ఘాటు విమర్శలు చేశారు. గొప్పగా.. దేశభక్తి గురించి మాట్లాడుతూ.. రాఫెల్ డీల్ గురించి నోరు ఎందుకు మెదపలేకపోతున్నారని ప్రశ్నించారు. పులివెందులకు వెళ్లికి జగన్ కేసుల గురించి మాట్లాడగలవా అని ప్రశ్నించారు.
తాను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నానని… ఆ ప్రజలే తనను కోరుకుంటున్నారని చింతమనేని స్పష్టం చేశారు. తానేంటో ప్రజలకు తెలుసన్నారు. దెందులూరు నియోజకవర్గానికి మాత్రమే తన గురించి తెలుసని.. ఇప్పుడు పవన్ కల్యాణ్ తనను రాష్ట్రానికి తెలిసేలా చేశారన్నారు. తన నియోజకవర్గానికి తనే పవన్ అని… చింతమనేని తేల్చారు.