దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేయాలని ఓ వైపు ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. మరో వైపు ఆయన ఆచూకీ తెలియడం లేదు. అరెస్టు చేయాలని ఉన్నతాధికారులు … పశ్చిమ గోదావరి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐపై డీఎస్పీ, డీఎస్పీపై ఎస్పీ, ఎస్పీపై డీఐజీ.. ఆయనపై.. మరొకరు.. ఇలా వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూనే ఉన్నారు. కానీ చింతమనేని మాత్రం.. ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు.
చింతమనేనిపై గత నెల 28వ తేదీన పినకడిమికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు కానీ అరెస్ట్ చేయలేదు. 29వ తేదీన ఇసుక విధానానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన ఆందోళనలో పాల్గొనేందుకు చింతమనేని సిద్ధమయ్యారు. పోలీసులు ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదవడంతో.. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని.. వెంటనే అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులే చింతమనేనికి సమాచారం ఇచ్చారని ప్రభుత్వ పెద్దలు ఫైరయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం తెలుసుకున్న సర్కారు పెద్దలు .. జిల్లా పోలీస్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లుగా ప్రచారం జరిగింది. చింతమనేనిని అరెస్ట్ చేయలేకపోవడం మీ అసమర్ధత అంటూ కొందరు పోలీస్ బాస్ లు జిల్లా పోలీస్ యంత్రాంగానికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. దాంతో జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి .. చింతమనేని కోసం గాలింపు చేపట్టారు. రెండు మూడు రోజులుగా చింతమనేని ఏలూరు కోర్టులో లొంగిపోతారనే ప్రచారం సాగడంతో ఆయనను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో పోలీసు బలగాలను మోహరించారు. ఆయన కూడా చింతమనేని వారికి దొరకలేదు. చింతమనేనిపై కక్ష సాధిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తూండటంతో.. ఆయన బాధితులమంటూ… పెద్ద ఎత్తున ఎస్పీ కార్యాలయానికి .. వచ్చి ఫిర్యాదులు చేసేలా వైసీపీ నేతలు ఇతరుల్ని తీసుకొస్తున్నారు. గురువారం ఒక్క రోజే 50 మంది చింతమనేనిపై ఫిర్యాదు చేశారు.