పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి పర్యటన సందర్భంగా ఇవాళ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గమైన దెందులూరులో పర్యటించ బోతున్నాడు. నిన్ననే చింతమనేని పై పవన్ కళ్యాణ్ కొంత ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ( https://www.telugu360.com/te/pawan-kalyan-fire-on-chintamaneni-prabhakar/ )ఆ వ్యాఖ్యలపై ఇవాళ ఉదయం ఒక టీవీ ఛానల్లో డిబేట్ లో చింతమనేని స్పందించాడు. అయితే ఆయన స్పందన చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఒకవైపు తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతూనే మరొకవైపు పవన్ కళ్యాణ్ ని దేబిరిస్తూ అడిగినట్టుగా కనిపించింది.
పవన్ కళ్యాణ్ నిన్నమాట్లాడుతూ చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా తయారవుతున్నారని, ఆయనపై పలు కేసులు ఉన్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని, లేకపోతే ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించాడు. గతంలో ఎమ్మార్వో వనజాక్షి పై చేయి చేసుకున్న సందర్భంలోనూ, ఆర్టిసి బస్సు పై చంద్రబాబు ఫోటో లేదని డ్రైవర్ పై దాడి చేసిన సందర్భంలోనూ, మరికొన్ని ఇతర సందర్భాలలో కూడా చింతమనేని ఇలాగే వివాదాలతో వార్తల్లో నిలిచాడు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా దెందులూరులో పర్యటించినప్పుడు చింతమనేని వైఖరిపై గట్టిగా మాట్లాడకుండానే, తూతూ మంత్రం విమర్శలతో, ముందుకు సాగిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ చింతమనేని పై చేసిన వ్యాఖ్యలతో స్థానికంగా కాక పుట్టింది.
దీనిపై ఇవాళ ఒక వార్త ఛానల్ లో జరిగిన డిబేట్ లో స్పందించాడు చింతమనేని. పవన్ కళ్యాణ్ కి అవగాహన లేదని, మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆరోపించాడు. అలాగే తెలుగుదేశం పార్టీని 2014లో తానే గెలిపించాలని పవన్ కళ్యాణ్ భ్రమ పడుతున్నాడని, 2009 లో తన సొంత అన్నయ్య ని గెలిపించుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ 2014 లో తెలుగుదేశం పార్టీని గెలిపించానని చెప్పడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశాడు. తనను రాజ్యాంగేతర శక్తిగా పవన్ కళ్యాణ్ అభివర్ణించడాన్ని తప్పు పట్టిన చింతమనేని, దెందులూరులో తనపై పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరాడు. ఒకవేళ తన పై పవన్ కళ్యాణ్ ఓడిపోతే , ప్రజలు తన పక్షాన నిలిస్తే , తాను రాజ్యాంగేతర శక్తి కాదని రాష్ట్రానికి అర్థం అవుతుందని అన్నాడు.
ఇలా చింతమనేని సవాళ్ళ పర్వం కొనసాగుతూ ఉండగానే ఆయన చేసిన వ్యాఖ్య డిబేట్ లో ఉన్న వాళ్ళు అందరినీ ఆశ్చర్యపరచింది. చింతమనేని మాట్లాడుతూ, ఒకవేళ తాను రాజ్యాంగేతర శక్తి అని పవన్ కళ్యాణ్ భావిస్తే, తనలా మరికొందరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో ఇలా రాజ్యాంగేతర శక్తులుగా ఉన్నారని ఆయన అనుకుంటే, వాళ్ళ అందరి పేర్లు ఆయన చెబితే తామంతా ఎన్నికల నుంచి తప్పుకుంటామని, అప్పుడు తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్దతు ప్రకటిస్తారా అని అడిగాడు. అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తే తాను, తన లాంటి మరికొందరు ఎమ్మెల్యేలు ఎన్నికల నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధమని చింతమనేని ప్రకటించాడు. అయితే ఈ వ్యాఖ్య అటు డిబేట్ లో ఉన్న వాళ్లతో పాటు ఇటు చూస్తున్న ప్రజలలో కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఒకవైపు ఏమో తన సొంత అన్నయ్య ను కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేడని, ఆయనకు అవగాహన లేదని, 2014లో అసలు పవన్ కళ్యాణ్ వల్ల తాము గెలవలేదని, తమంతకు తామే సొంతంగా గెలిచామని వ్యాఖ్యానిస్తూ, మరొక పక్క 2019లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తా అంటే ఎన్నికల నుంచి కూడా తప్పుకుంటామని చింతమనేని వ్యాఖ్యానించడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు అనుకుంటున్నారు. ఆయన ముందు పవన్ కళ్యాణ్ పై, తనపై పోటీ చేసి గెలవాలని విసిరిన సవాల్ వరకు పరిమితమై ఉంటే బాగుండేది. అలా కాదు అంటే పవన్ కళ్యాణ్ మద్దతు కోరి ఉన్నా సరిపోయేది. ఒకపక్క సవాల్ విసురుతూ, మరొక పక్క ఆయన మద్దతు కోసం దేబిరించడం దేనికి సంకేతమని చింతమనేనికే తెలియాలి.
ఏది ఏమైనా, ఇవాళ్టి పవన్ దెందులూరు సభ పై ఆసక్తి నెలకొంది.