సినిమా ప్రచారం కూడా ఓ స్ట్రాటజీనే. అంతా ఓ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్లాలి. పెద్ద సినిమాలకు, వందల కోట్ల పెట్టుబడితో తీసిన భారీ చిత్రాలకు ఆ ప్లానింగ్ చాలా అవసరం. ఈ విషయంలో `సైరా` చాలా వెనకబడిందనే చెప్పాలి. అది పరోక్షంగా వసూళ్లపైనా ప్రభావం చూపించింది. సరైన సమయంలో, సరైన రీతిలో ప్రచారం చేసుకోకపోవడం వల్ల సైరాకి రావల్సినంత మైలేజీ రాలేదు. అయితే ఈ మధ్య చిరంజీవి కాస్త మేల్కొని జగన్ని కలిశాడు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో భేటీ అయ్యారు. ఈ ప్రయత్నాలు సైరాని ఇంకొన్ని రోజులు వార్తల్లో ఉంచడానికి ఉపయోగపడతాయి. అంతే తప్ప.. వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపదు.
సైరాకి పబ్లిసిటీ పెంచుకోవాలని, తద్వారా మరిన్ని వసూళ్లు రాబట్టుకోవాలని చిరు భావిస్తే ఈ పనేదో ముందే చేయాల్సింది. సైరాకి సంబంధించి ఇటీవల జగన్ ట్వీట్ చేశారు. విడుదలైన ఒకట్రెండు రోజుల్లో జగన్ నుంచి ఈ ట్వీటు పడి ఉంటే, ఫలితం మరోలా ఉండేది. ఇప్పటికిప్పుడు వెంకయ్య నాయుడు `సైరా` సినిమా చూసి, చిరునీ, టీమ్నీ పొగడ్తలతో ముంచేయ్యడం వల్ల కలిగే లాభమేమీ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే సైరా ఫైనల్ రన్ దశకు వచ్చేసింది. చూడాల్సిన వాళ్లు చూసేశారు. అమేజాన్లో చూద్దామనుకున్నవాళ్లు ఆగిపోయారు. సైరా హడావుడి దాదాపుగా ముగిసిపోయింది. ఏదైనా వేడిలో ఉన్నప్పుడే జరగాలి. అది సినిమా ప్రచారానికీ వర్తిస్తుంది. సినిమాపై ఓ అభిప్రాయానికి జనం వచ్చేసిన తరవాత.. ఇలాంటి ప్రయత్నాలు తగిన ఫలితాన్ని ఇవ్వలేవు.