హైదరాబాద్: ఎట్టకేలకు చిరంజీవి 150వ చిత్రంపై స్పష్టత వచ్చింది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిన్న రిట్జ్ ఐకాన్ అవార్డ్ అందుకోవటానికి బెంగళూరు వెళ్ళినపుడు అధికారికంగా ఒక మీడియా సంస్థకు దీనిపై సమాచారం ఇచ్చారు. 150వ చిత్రాన్ని ఖరారు చేశామని, తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన ‘కత్తి’ని రీమేక్ చేస్తున్నామని, వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారని ఆ వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటివరకు ఈ సమాచారాన్ని అధికారికంగా ఎవరికీ చెప్పలేదని, మొదటిసారిగా మీకే చెబుతున్నానని ఆ మహిళా జర్నలిస్టుతో అన్నారు.
గత ఆగస్ట్‌లో చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా, 150వ సినిమాకు వినాయక్ ఖరారయినట్లు వార్తలొచ్చినప్పటికీ, మళ్ళీ దానిపై పునరాలోచనలో పడ్డట్లు ఇటీవల పుకార్లు వచ్చాయి. దానికితోడు వినాయక్ ఇటీవల దర్శకత్వం వహించిన అఖిల్ సినిమా ఫ్లాప్ కావటంతో ఆ పుకార్లు బాగా ఊపందుకున్నాయి. కొందరైతే వినాయక్ అసలు సినిమాలకు గుడ్ బై చెబుతామనుకుంటున్నట్లు కూడా రాశారు. ఈ పరిస్థితుల్లో రాంచరణ్ ఆ ఊహాగానాలన్నింటికీ తెరదించేశారు.