చిరంజీవి 151వ సినిమా విషయంలో మార్పులూ చేర్పులూ చోటుచేసుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఉయ్యాల వాడ నరసింహారెడ్డిని చిరు 151వ పట్టాలెక్కించడానికి అంతా రెడీ అనుకొన్నా.. ఇప్పుడు ఆ కథని తాత్కాలికంగా పక్కన పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో మెగా కాంపౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉయ్యాల వాడ నరసింహారెడ్డికి సంబంధించి మరింత రిసెర్చ్ అవసరం అని భావించిన చిరు.. ఆ పనిలో సూరిని ఉండమని చెప్పాడట. ఈలోగా.. మరో సినిమాని మొదలెడితే బాగుంటుందన్నది చిరు ఆలోచన. ఖైదీ నెం.150 మంచి విజయాన్ని అందుకోవడం, చిరు రీ ఎంట్రీ ఘనంగా చాటుకోవడంతో ఈ వేడిలోనే మరో సినిమా తొందరగా మొదలెట్టాలన్నది చిరు ఆలోచన. ఉయ్యాల వాడ తో పెట్టుకొంటే ఆలస్యమయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే… ఈలోగా ఎవరి దగ్గరైనా కథ రెడీగా ఉంటే.. దాంతో ప్రొసీడ్ అయిపోవాలన్నది చిరు ఆలోచన. అందులో భాగంగా ఇప్పుడు బోయపాటి శ్రీనుని రంగంలోకి దించారని తెలుస్తోంది. ఇటీవల చిరుని బోయపాటి రెండు మూడు సార్లు కలసి వెళ్లాడని, కచ్చితంగా చిరు 151 ప్రాజెక్టు విషయంలో మార్పులు చూడబోతున్నామని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు సురేందర్ రెడ్డి కూడా స్క్రిప్టు విషయంలో తలమునకలై ఉన్నాడు. వీలైనంత త్వరగా స్ర్కిప్టుని లాక్ చేసి చిరుకి వినిపించాలని చూస్తున్నాడు. ఏప్రిల్ నెలాఖరులోగా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి స్క్రిప్టు పూర్తవుతుందనుకొంటే.. ఎదురు చూడొచ్చని, ఇంకా టైమ్ పట్టేట్టు ఉంటే.. బోయపాటితో ప్రొసీడ్ అవ్వడం బెటరని చిరు భావిస్తున్నాడట. బోయపాటి దగ్గర కథ రెడీగా ఉందా, లేదా? అనేదే ఇప్పుడు చూసుకోవాల్సింది. బోయపాటి స్టోరీ రెడీ అంటే.. ఈ సినిమా సూరి నుంచి శ్రీను చేతికి మారిపోవడం ఖాయం.