చిరు 150వ సినిమా చేయాలని ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నాడు అల్లు అరవింద్. అయితే ఈ సినిమాని చాకచక్యంగా తన సొంత సంస్థలోనే తీసేశాడు రామ్ చరణ్. 150 మిస్ అవ్వడంతో కనీసం 151 అయినా అల్లు అరవింద్ చేతికి వెళ్తుందనుకొన్నారు. ‘చిరు 151వ సినిమా నేనే చేస్తా’ అని అరవింద్ కూడా ఓ సందర్భంలో మీడియా ముఖంగా విన్నవించుకొన్నారు. ఆ సినిమాకి గానూ సురేందర్ రెడ్డిని లైన్లోకి తీసుకొచ్చింది అరవింద్‌నే. దాంతో చిరు 151 సినిమా ఆయన చేతుల్లోకి వెళ్లిపోతుందనుకొన్నారు. కానీ.. చరణ్ ఇప్పుడు మామకి మరో ట్విస్ట్ ఇచ్చాడు. 151 కూడా తన సొంత సంస్థ కొణిదెల కంపెనీలోనే ఉంటుందని ప్రకటించాడు. ”నాన్నగారి 151వ సినిమాకి కూడా నేనే నిర్మాతని. ఆ విషయాలు త్వరలో ప్రకటిస్తా” అంటూ ఓ వీడియో బైట్ విడుదల చేశాడు చరణ్. దాంతో… అల్లు మామకి గట్టి షాక్ తగిలినట్టైంది.
ఖైదీ నెం.150 ఫైనల్ అవుట్ పుట్, దాని బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం గానీ, ఈ సినిమా విడుదలకు ముందే భారీగా టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోగలిగింది. నిర్మాణపరంగానూ చరణ్‌కి ఈ సినిమా ఓ పెద్ద పాఠంగా మిగిలింది. దాంతో.. ప్రొడక్షన్లో ఉన్న రుచిని పట్టేశాడు చరణ్. అందుకే 151వ సినిమా కూడా తన చేతుల్లోకే తెచ్చుకొన్నాడని టాక్. ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న మాస్టర్ బ్రైయిన్ అల్లు అరవింద్…. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సురేందర్ రెడ్డి తో ఓ సినిమా చేయాలని ఆయన ముందే అగ్రిమెంట్ చేయించుకొన్నారు. ఒకవేళ చిరు సినిమాకి సూరినే దర్శకుడి అయితే.. గీతా ఆర్ట్స్‌ని దాటి సూరి బయటకు రావాలి. అప్పుడేమైనా అరవింద్ తన వ్యూహాలతో గీతా ఆర్ట్స్‌లోనే ఆ సినిమా చేయాలని పట్టుబడతాడా, లేదంటే బావ కోసం త్యాగం చేస్తాడా… అనేది ఆసక్తికరంగా మారింది.