వెండి తెరపై చిరుది నాలుగు దశాబ్దాల ప్రయాణం. 30 ఏళ్లుగా ఆయనే నెంబర్ వన్. ఇప్పటికీ అదే ఉత్సాహంతో నటిస్తున్నారు. సినిమాలు చేస్తున్నారు. అగ్ర హీరోల్లో.. బిజీ బిజీగా ఉంటూ సినిమాలు చేస్తోంది చిరు ఒక్కడే. చిరుకి కథలపై అపారమైన జడ్జిమెంట్ ఉంది. సెట్లో కొన్నిసార్లు అపధర్మ దర్శకుడిగానూ అవతారం ఎత్తారు. భవిష్యత్తులో చిరంజీవిని దర్శకుడిగా చూసే అవకాశం ఉందా? అంటే… `అవును` అనే సమాధానం ఇస్తున్నారు చిరంజీవి.
ఈనెల 13న వాల్తేరు వీరయ్య విడుదల సందర్భంగా ఈరోజు చిరంజీవి హైదరాబాద్ లో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దర్శకత్వం అంశం ప్రస్తావనకు వచ్చింది. ”జీవితాంతం సినిమాలతో మమేకం అవ్వాలనుకొంటున్నారు. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానన్న నమ్మకం నాకు వచ్చి, ఆ అవకాశం కూడా కుదిరితే తప్పకుండా చేస్తానేమో..” అంటూ క్లారిటీ ఇచ్చేశారు చిరు. వాల్తేరు వీరయ్యపై చిరు గట్టి నమ్మకంగా ఉన్నారు. ఏ ఫంక్షన్లో అయినా.. వీరయ్య గురించి పూర్తి విశ్వాసంతో మాట్లాడుతున్నారు. “నా అభిమానులకు ఏం కావాలో.. అవన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్ ఇది..” అంటూ వాల్తేరు విజయంపై తనకున్న నమ్మకాన్నిమరోసారి బయటపెట్టారు చిరు. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి కథానాయికగా నటించింది. రవితేజ కీలక పాత్రధారి.