ఆమధ్య చిరంజీవితో మారుతి ఓ సినిమా చేస్తాడన్న వార్త చక్కర్లు కొట్టింది. యూవీ క్రియేషన్స్ లో ఈ సినిమా రాబోతోదందని గాసిప్పులు గుప్పుమన్నాయి. తరవాత మారుతి కూడా `చిరుతో సినిమా ఉంది` అని క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ కాంబోపై ఆసక్తి మొదలైంది. కాకపోతే.. అటు చిరు, ఇటు మారుతి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. మారుతికి ప్రభాస్ దొరికాడు. చిరు చేతిలో నాలుగైదు సినిమాలు ఉండిపోయాయి. దాంతో… మారుతి – మెగా సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. `ఈ సినిమా లేనట్టే` అంటూ మళ్లీ వార్తలు గుప్పుమన్నాయి. దానిపై మారుతి కూడా ఏమాత్రం స్పందించకపోవడంతో…. చిరు సినిమా చేజారిపోయిందని అంతా అనుకొన్నారు. అయితే.. ఇప్పుడు ఈ కాంబోపై మళ్లీ ఆశలు చిగురించాయి.
మారుతి దర్శకత్వం వహించిన తాజా చిత్రం `పక్కా కమర్షియల్`. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్పీచులో మారుతితో సినిమా టాపిక్ వచ్చింది. మారుతితో ఓ సినిమా చేయాలనుకుంటున్నానని, తనని కథపై ఫోకస్ చేయమని చెప్పానని చిరు సభాముఖంగా చెప్పేశారు. దాంతో… ఈ కాంబో మళ్లీ వార్తల్లోకి నిలిచింది. మారుతి ఫోకస్ అంతా ఇప్పుడు ప్రభాస్ సినిమాపై ఉంది. దాన్ని కూడా వీలైనంత త్వరగా ముగించాలని ప్లాన్ చేస్తున్నాడు మారుతి. ఈలోగా.. చిరు ఖాళీ అయితే, మారుతి – మెగా కాంబో పట్టాలెక్కేయడం ఖాయం. ఇప్పటికే చిరుకి తగిన కథని మారుతి రెడీ చేసి పెట్టుకొన్నాడు. కావల్సిందల్లా.. మెగా ఆమోదమే. సో… ఈ కాంబోని త్వరలో చూడొచ్చన్నమాట.