సాధారణంగా హిట్ సినిమాల గురించే మాట్లాడుకుంటారంతా. వేదిక ఎక్కితే చాలు.. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయి ”ఆ సినిమాలో పొడిచేశాం, ఇరగదీశాం” అంటుంటారు. ఫ్లాప్ సినిమాల్ని కూడా ‘ఆ సినిమా హిట్టే’ అని డబ్బా కొట్టుకుంటారు. కానీ చిరంజీవి మాత్రం అలా కాదు. తన ఫ్లాపుని గుర్తు చేసుకున్నాడు. కారణం నేనే అంటూ… తప్పు ఒప్పుకున్నాడు. ‘తేజ్’ ఆడియో ఫంక్షన్లో ఈ వి`చిత్రం` జరిగింది. కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది. ఆయనతో చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. 1980ల్లో కె.ఎస్.రామారావు బ్యానర్లో వరుస సినిమాలు చేశాడు చిరు. అభిలాష, ఛాలెంజ్, మరణమృదంగం ఇలాంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. చిరంజీవికి ‘మెగా స్టార్’ అనే బిరుదు ఇచ్చింది కూడా ఆయనే. ఈ సందర్భంగా కె.ఎస్.రామారావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు చిరు. హిట్ సినిమాల్ని ప్రస్తావించి.. తన కెరీర్లో అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటైన `స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్`నీ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఇది కూడా కె.ఎస్.రామారావు సినిమానే.
”అప్పటికే యండమూరితో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన చెప్పిన కథ నచ్చి సినిమాగా చేద్దామనుకున్నా. దర్శకుడిగా ఆయన్ని ఎంచుకోవడం కూడా రామారావుగారి నిర్ణయమే. అయితే.. స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ కంటే యండమూరి ఓ సినిమాకి దర్శకత్వం వహించారు. అది ఫ్లాప్ అయ్యింది. దాంతో బయర్లు భయపడ్డారు. కె.ఎస్ రామారావు కూడా `యండమూరి స్థానంలో మరొకర్ని తీసుకుందామా` అని అడిగారు. కానీ నేనే ఒప్పుకోలేదు. `ఇప్పటికే మాటిచ్చాం. పైగా ఒక్క సినిమాతోనే ఆయన్ని పక్కన పెట్టకూడదు` అని చెప్పా. నా మాటని కాదనలేక యందమూరితో ఆ సినిమా పూర్తి చేశాం. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంస్థకు పెద్ద పరాజయం ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. ఆ బాధ ఇప్పటికీ ఉంది” అన్నారు. అయితే ఆ ఫ్లాప్‌కి బదులు తీర్చుకోబోతున్నాడు చిరు. చరణ్‌తో ఆ సంస్థలో ఓ సినిమా చేస్తున్నా అని ప్రకటించాడు. అది ఇది కేవలం చరణ్ కోరికే నట. ”ఓసారి డైనింగ్ టేబుల్ దగ్గర కె.ఎస్.రామారావు గారికి సంబంధించిన డిస్కర్షన్ వచ్చింది. ఆయనతో ఓసినిమా చేయాలని వుంది డాడీ అన్నాడు. దర్శకుడు ఎవరైనా సరే.. రామారావు గారితో చరణ్ ఓ సినిమా చేస్తాడు” అని సభాముఖంగా ప్రకటించాడు చిరు. అలా.. మెగా ఫ్యామిలీతో ఈ సంస్థ అనుబంధం మున్ముందు కూడా కొనసాగబోతోందన్నమాట.