మానిన గాయాన్ని మళ్లీ రేపకూడదు. అది ఏ స్థాయిలో ఉన్నవారికైనా మంచిది కాదు. చిరంజీవికి ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలయ్ బలాయ్ కార్యక్రమంలో చిరు – గరికపాటి ఎపిసోడ్ గురించి అందరికీ తెలిసిందే. వారం రోజుల పాటు మీడియాకు ఇది ముడిసరుకు అయిపోయింది. గరికపాటిని మెగా ఫ్యాన్స్ చెడుగుడు ఆడేసుకొన్నారు. నాగబాబు నుంచి వర్మ వరకూ అందరూ దిగిపోయి…. గరికపాటిపై విరుచుకుపడ్డారు. `ఆ పెద్దాయన్ని అలా వదిలేయండ్రా..` అన్నా ఎవరూ వినలేదు. కాల మహిమ…గరికపాటి ఎపిసోడ్ ని కాలమే మర్చిపోయేలా చేసింది. దాన్ని ఇప్పుడు చిరు మళ్లీ కెలికారు.
శుక్రవారం ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సభ ముగుస్తున్న తరుణంలో… మహిళలంతా చిరుని చుట్టిముట్టారు.. ఫొటోల కోసం. ఆ సమయంలో… చిరు `ఇక్కడ వారు లేరు కదా..` అంటూ గరికపాటిని గుర్తు చేశారు. దాంతో సభికులు ఘొల్లు మన్నారు. చిరు సమయస్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే. అందులో మరో మాట లేదు.కాకపోతే…. గరికపాటి ఎపిసోడ్ ని అందరూ మర్చిపోయినా `నేను మర్చిపోలేదు` అన్నట్టు మారింది చిరు వెటకారం. ఇప్పుడు మరి కొద్దిరోజులు గరికపాటి వార్తల్లో ఉంటారు. మళ్లీ మెగాఫ్యాన్స్ అందుకోవడం మొదలెడతారు. ఇదంతా ఇప్పుడు మళ్లీ అవసరమా చిరూ…? అలయ్ బలాయ్ వేదికపై ఎంత హుందాగా ఉన్నావో.. ఇప్పుడూ అలానే ఉంటే సరిపోయేదిగా..?!