కాపు కార్పొరేషన్ ద్వారా వీలైనంత మైలేజి సంపాదించాలని ఒకవైపు చంద్రబాబు అరాటపడిపోతున్నారు. మరోకవైపు తన మనిషిని నియమించలేదని ముద్రగడ చెలరేగుతున్నారు. ఇంకోకవైపు తన మనుషులచేతికే కార్పొరేషన్ పగ్గాలు రావాలని కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి పైరవీలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.
కాపు కార్పొరేషన్ అంటే నాయకులూ అందరికీ ఇప్పుడు ఆశలు పెరిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయల కేటాయింపులు కూడా పొందిన ఈ కార్పొరేషన్ కు ఎండి నియామకం జరగాల్సి ఉంది. సమర్ధుడైన గ్రూప్ 1 స్థాయి అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన ఆ పదవి కోసం పలువురు పైరవీలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో కీలకంగా లేకపోయినప్పటికీ ఎంపీ చిరంజీవి కూడా దీని కోసం తన మనిషిని ఎండీ చేయడానికి ఆశ పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం అయన మంత్రి గంట శ్రీనివాసరావు ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
చిరంజీవి కి సన్నిహితుడైన ఒక అధికారి గతంలో అయన కేంద్ర మంత్రి గా ఉన్న సమయంలో అయన పేషీలో చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ అధికారి రాష్ట్ర సర్వీసులోనే ఉన్నారు. ఆయనను కాపు కార్పొరేషన్ ఎండి చేయాలని చిరు అనుకుంటున్నారట. పుష్కలంగా నిధులు ఉండే ఈ కార్పొరేషన్ పదవి అంటే ఆ వర్గంలో పట్టు సాధించడానికి ఉపయోగపడుతుందని అయన ఆలోచన కావచ్చు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దృష్టి మరో అధికారి మీద ఉన్నట్లుగా తెలుస్తున్నది. అయన గతంలో వట్టి వసంత కుమార్ మంత్రి గా ఉండగా అయన వద్ద పని చేసారు. అయన నియామకం నేడో రేపో బయటకు వస్తుందని అనుకుంటున్నా తరుణంలో తాజాగా చిరు ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే కామెడీ ఏంటంటే.. చిరు పేషీ, వట్టి పేషీ లకు సంబంధించిన వారె తప్ప కాపు కార్పొరేషన్ కు ఎండి చేయడానికి టీడీపీ ముద్ర ఉన్న విశ్వసనీయమయిన అధికారి ఒక్కరైనా లేకుండా పోయారా అని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.