ఈ సంక్రాంతికి ‘విశ్వంభర’ని చూసేద్దాం అనుకొన్నారు మెగా ఫ్యాన్స్. అయితే… ‘గేమ్ ఛేంజర్’ కోసం మే 9కి వాయిదా పడింది. అందుకే ‘విశ్వంభర’ పనులన్నీ తాయితీయిగా జరుగుతున్నాయి. మరోవైపు తన తదుపరి సినిమాకు సంబంధించిన కథ కూడా సెట్ చేసుకొనే పనిలో ఉన్నాడు మెగాస్టార్. `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెల చిరుకి ఓ కథ చెప్పారు. నాని ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. అనిల్ రావిపూడి కథకు సైతం చిరు ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. ముందుగా రావిపూడి సినిమానే పట్టాలెక్కుతుంది. ఆ తరవాత శ్రీకాంత్ సినిమా ఉంటుంది. అనిల్ రావిపూడి సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్. ‘రౌడీ అల్లుడు`’టైపు కథ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే శ్రీకాంత్ ఓదెల సినిమా మాత్రం పూర్తి విభిన్నంగా ఉంటుందట. ఈ సినిమా ఓ రకంగా చిరు కెరీర్లో ప్రయోగం లాంటిదని తెలుస్తోంది. సాధారణంగా చిరంజీవి సినిమా అంటే పాటలు, డాన్సులు ఆశిస్తారు. అలాంటివేం ఈ సినిమాలో ఉండవట. హీరోయిన్ పాత్ర కూడా కనిపించదని తెలుస్తోంది. కమల్ హాసన్ ‘విక్రమ్’ తరహాలో సాగే క్యారెక్టర్ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘గాడ్ ఫాదర్’లోనూ చిరంజీవికి హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. కానీ..సల్మాన్ ఖాన్ తో చిరు స్టెప్పులు వేశాడు. శ్రీకాంత్ ఓదెల సినిమాలో అలాంటి స్టెప్పులకూ చోటుండదని, చిరుని నెవర్ బిఫోర్ క్యారెక్టరైజేషన్లో చూపిస్తున్నారని తెలుస్తోంది.