చిరంజీవి – జగన్ మధ్య మరోసారి పదో తేదీన సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సారి ఒక్క చిరంజీవి మాత్రమే కాదు టాలీవుడ్‌కు చెందిన వివిధ వ్యాపార విభాగాల ప్రతినిధులతో కలిసి చిరంజీవి తాడేపల్లికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వారందరితో జగన్ భేటీ అవుతారు. గత సమావేశంలో చిరంజీవి ఒక్కరే పాల్గొన్నారు. దీని వల్ల అది వ్యక్తిగత సమావేశం అన్న ప్రచారం అయింది. ఈ సారి అలాంటి అవకాశం లేకుండా టాలీవు్డ మొత్తానికి చర్చల్లో ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సీఎం జగన్ అపాయింట్మెంట్ విషయంపై స్పష్టత ఉండటంతోనే చిరంజీవి చాంబర్ పెద్దలతో కలిసి సమస్యలపై చర్చించాలని అనుకున్నారు. సోమవారం సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. కీలకమైన సభ్యులు అందుబాటులో లేకపోవడం వల్ల మీటింగ్ నిర్వహించడం లేదని ఛాంబర్ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. మంగళ, బుధవారాల్లో చర్చలు జరిపి ఓ ఎజెండా ఖరారు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏపీలో టిక్కెట్ రేట్ల అంశానికి పరిష్కారం దొరుకుతుందని టాలీవుడ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. హైకోర్టు సూచనలతో ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ చర్చలు జరుపుతోంది. టాలీవుడ్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన వారితో మూడు దఫాలుగా చర్చలు జరిపింది. పదో తేదీన హైకోర్టులో ఈ అంశంపై విచారణ కూడా ఉంది. ఈ క్రమంలో చిరంజీవి బృందంతో సమావేశం తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.