నిన్న జరిగిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవనే చాలా బలమయిన సంకేతమే తమ అభిమానులకు అందించారని చెప్పవచ్చును. ఈ విషయంలో చిరంజీవి మాట్లాడిన వంద మాటల కంటే పవన్ కళ్యాణ్ చెప్పిన చిన్న చిన్న మాటలు, చేతలే అభిమానులకు చాలా బలమయిన సందేశం ఇచ్చాయని చెప్పవచ్చును. చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ వినయంగా చేతులు కట్టుకొని ఆయన చెపుతున్న మాటలను శ్రద్దగా వినడం, ఆయన మాట్లాడుతూ కొద్దిగా గొంతు సవరించుకోవడానికి దగ్గినప్పుడు చేతిలో ఉన్న నీళ్ళ బాటిల్ అన్నకి అందించడం వంటివి అన్న పట్ల ఆయనకి ఎంత గౌరవం, అభిమానం ఉందో కళ్ళకు కట్టినట్లు చూపాయి. పవన్ కళ్యాణ్ మాటలు, చేతలు కూడా అభిమానుల మనసులను తాకే ఉండవచ్చును. ఒకానొక సమయంలో తన అన్నయ్య చిరంజీవి ఎవరో ఇచ్చిన బూట్లు, చెప్పులు వేసుకొని సినిమా షూటింగులకి వెళ్ళేవారని కానీ తాను ఆయన దయతో ఒకేసారి స్టార్ డమ్ సంపాదించుకోగలిగానని పవన్ కళ్యాణ్ నిసంకోచంగా చెప్పుకొన్నారు.
అన్నయ్య షూటింగ్ నుండి అలిసిసొలిసి వచ్చి బూట్లు కూడా విప్పకుండా అలాగే పడుకొండిపోతే, తనే ఆయన బూట్లు, సాక్సులు విప్పేవాడినని చెప్పారు. అంతే కాదు ఆయన సాక్సు నుండి వచ్చే చెమట వాసనను దుర్వాసనగా కాక అది ఆయన కష్టానికి నిదర్శనంగా మాత్రమే కనిపించేదని చెప్పడం పవన్ కళ్యాణ్ యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని మరోమారు ఆవిష్కరించింది.
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ల తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అమ్మల్లు, నాన్నల వలననే వారి పరువు ప్రతిష్టలు మంట గలుస్తుంటాయి. కానీ “పవన్ కళ్యాణ్ నా తమ్ముడు” అని చిరంజీవి గర్వంగా చెప్పుకొనే విధంగా పవన్ కళ్యాణ్ ఎదిగారు. తన అన్నగారి ప్రోత్సాహంతోనే సినీ పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేనప్పటికీ, అన్నయ్య పేరు,ప్రతిష్టలకు తన వలన భంగం కలగకూడదని భయడుతూ మసులుకొనేవాడినని పవన్ కళ్యాణ్ చెప్పడం అందరినీ ఆకట్టుకొంది. చిరంజీవి కూడా తమ్ముడిపై అభిమానం బాగానే కనబరిచారు కానీ ఆయన మాటలలో గుండెలను స్ప్రుశించే ఇటువంటివేవీ కనబడలేదు. సినీ పరిశ్రమలో కొనసాగుతూనే వేరే రంగంలో (రాజకీయాలు అనే పదం వాడకపోవడం గమనార్హం) కూడా పనిచేసుకోమని చిరంజీవి చెప్పడాన్ని అందరూ హర్షించారు.