టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన కాంబోకి తెర లేచింది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కథకు చిరంజీవి ఓకే చెప్పారు. ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ కథానాయకుడు నాని సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఈరోజు కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. రక్తంతో తడిచిన ఓ చేయిని హైలెట్ చేస్తూ ‘హీ ఫైన్డ్స్ హిస్ పీస్ ఇన్ వయెలెన్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. హింసలోనే శాంతిని వెదుక్కొనే ఓ కథానాయకుడి కథ ఈ సినిమా అనేది క్యాప్షన్ ని బట్టి అర్థం అవుతోంది. మెగాస్టార్ కెరీర్లో వయెలెన్స్ ఉన్న సినిమా ఇదేనంటూ చిత్రబృందం పేర్కొంది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ పనుల్లో ఉన్నారు. 2025 మేలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. మరోవైపు నాని – శ్రీకాంత్ ఓదెల కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అది పూర్తయ్యాకే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. నానికి వాల్ పోస్టర్ అనే ఓ బ్యానర్ ఉంది. అయితే ఈసారి యునానిమస్ అనే మరో సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ ఈ నిర్మాణంలో భాగం పంచుకొంటుంది. ఈమధ్య చాలామంది దర్శకులు చిరంజీవికి కథలు చెప్పారు. అయితే వాటిలో చిరుకి ఏదీ సంతృప్తి ఇవ్వలేదు. ఈ కథ మాత్రం సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయ్యిందని తెలుస్తోంది.