సోమవారం చిరంజీవి ఇంట్లో ఓ కీలకమైన సమావేశం జరిగింది. జగన్ తో మీటింగ్ ఖరారు అవ్వడంతో.. ఆయనతో ఏం మాట్లాడాలి? అనే విషయంపై చిరు ఇండ్రస్ట్రీలోని మిగిలిన ప్రముఖులతో చర్చించారు. అయితే.. వాటితో పాటు ఇతర విషయాలూ చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ఇండ్రస్ట్రీకి సంబంధించిన కొన్ని కీలకమైన సలహాలూ, సూచనలూ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. ముఖ్యంగా.. వీపీఎఫ్ల అద్దెను థియేటర్ల నుంచి కాకుండా, డిస్టిబ్యూటర్ల నుంచి ఎందుకు వసూలు చేస్తున్నారు? అని గట్టిగా అడిగినట్టు తెలుస్తోంది. థియేటర్లకు వీపీఎఫ్లు అందించి, ఆ అద్దెని డిస్టిబ్యూటర్ల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ వీపీఎఫ్ల వెనుక అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు కీలకమైన వ్యక్తులు. ఆ నలుగురికీ ఈ సందర్భంగా చిరు క్లాస్ పీకినట్టు సమాచారం. ఇప్పటిటికే థియేటర్ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందని, దాన్ని చక్కబెట్టుకోవాలంటే కొన్ని త్యాగాలు తప్పవని, కొన్ని మార్పులు అవసరమని చిరు గట్టిగా చెప్పార్ట. ఆన్ లైన్ టికెట్ వ్యవస్థపై గురించి కూడా కొంత కీలకమైన చర్చ జరిగిందని టాక్. ఆన్ లైన్లో టికెట్ బుట్ చేసుకుంటే, సర్వీస్ ఛార్జ్ పడుతుంది. ఆ ఛార్జ్ అటు థియేటర్లకూ, ఇటు నిర్మాతలకూ చెందదు. మధ్యలో సర్వీస్ ప్రొవైడర్లు పట్టుకుపోతారు. ఆ ఛార్జీని పూర్తిగా లేకుండా చేసి, ప్రేక్షకుడిపై భారం తగ్గిస్తే ఎలా ఉంటుందన్న విషయంపై చర్చ సాగిందని సమాచారం. ఓటీటీల విషయంలో ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఆయా సంస్థలతో చేసుకోవాల్సిన ఒప్పందాలేంటి? ఓ నిర్మాత ఓటీటీకి సినిమాకి అమ్ముకునే ముందు ఓటీటీలపై పూర్తి అవగాహన కల్పించేలా చూడాలని సూచించినట్టు టాక్. తమిళనాడు, కేరళ నిర్మాతల మండలులు సొంతంగా ఓటీటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరహాలోనే టాలీవుడ్ కూడా సొంతంగా ఓటీటీ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? అనే టాపిక్ కూడా ఈ సందర్భంగా వచ్చిందని టాక్.