బిగ్ బాస్ సీజన్ 4 అయిపోయింది. ఈ సీజన్నీ నాగార్జున సమర్థంగానే ముందుకు నడిపించినట్టు లెక్క. బిగ్ బాస్ 3 ఫినాలేకి చిరంజీవి హౌస్ట్ గా వచ్చి అలరించారు. సీజన్ 4లోనూ ఆయనే ముఖ్య అతిథి. చిరు రాక.. ఈ షోకి కొత్త వన్నె తీసుకొచ్చింది. చిరు తనదైన శైలిలో కౌంటర్లు వేసి, ఫినాలేని రక్తి కట్టించారు. చిరు – నాగ్ ల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఇద్దరూ ఒకే వేదికపై ఉంటే అది మరింత స్పష్టంగా బయటపడుతుంటుంది. ఈ వేదికపై చిరుపై నాగ్, నాగ్ పై చిరు పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సీజన్‌ని నాగార్జున బాగా నడిపించాడని, ఈ సీజన్‌కే కాదు.. రాబోయే పది సీజన్లకు కూడా నాగార్జుననే హోస్ట్ గా ఉండాలన్న ఆశాభావం వ్యక్తం చేశాడు చిరు.
అయితే వచ్చే సీజన్లో నాగార్జున హోస్ట్ గా కనిపించడం అనుమానమే అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్ కోసం నాగార్జునని ఒప్పించడమే కష్టమైపోయిందని, వచ్చే సీజన్లో ఆయన కనిపించకపోవొచ్చన్నది ఇన్ సైడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నమాట. వచ్చే సీజన్లో ఓ కొత్త స్టార్ కనిపిస్తాడని, ఆయన చిరంజీవి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
రెండు ఫినాలేల్లోనూ చిరు.. ఈ షోని ఓన్ చేసుకున్న పద్ధతి చూస్తే – చిరు బిగ్ బాస్ షోని రెగ్యులర్ గా చూస్తున్నాడన్న ఫీలింగ్ వస్తుంది. వేదికపై చిరు చాలా చలాకీగా కనిపిస్తున్నాడు. స్పాంటెనీస్గా మాట్లాడేస్తున్నాడు. `మా`లో ప్రసారమైన `మీలో ఎవరు కోటీశ్వరుడు` ని ముందు నాగ్ నడిపించారు. ఆ తరవాత ఓ సీజన్లో చిరంజీవి హోస్ట్ గా దర్శనమిచ్చాడు. అలాగే ఇప్పుడు కూడా నాగ్ చేతుల్లోంచి.. చిరుకి ఈ షో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే 5 వ సీజన్ లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో..? చిరు సినిమాలతో బిజీగా ఉంటే, ఆయన్ని రంగంలోకి దించడం కష్టం. నాగ్ అందుబాటులో లేకుండా, నాగ్ కాకుండా మరో ప్రత్యామ్నాయం కావాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావించినప్పుడు, చిరు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే.. ఈ సమీకరణాలు నిజం అవుతాయి. ఏం జరుగుతుందో చూడాలి.