మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో వరసగా షూటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా చంచల్ గూడ జైలు ప్రాంగణంలో షూటింగ్ చేయాలని దర్శకుడు వి వి వినాయక్ నిర్ణయించాడు. జైలు వెనుక భాగంలోని పాత జువెనైల్ హోం ప్రాంతంలో షూటింగ్ కు అనుమతి తీసుకున్నారు. నిజానికి సోమవారం నుంచి మూడు రోజులు షూటింగ్ జరపాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల మంగళవారం నుంచి షూటింగ్ చేస్తామని సినిమా నిర్మాత తెలిపినట్టు జైలు అధికారులు చెప్పారు.
చిరు 150వ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. తమిళ రీమేక్ అయినా ఆ వాసనలు లేకుండా ఫ్రెష్ లుక్ తో సినిమాను తెరకెక్కించడానికి వినాయక్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. ఒక రచయిత కాకుండా పవర్ ఫుల్ డైలాగ్స్ కు పరుచూరి బ్రదర్స్, సెంటిమెంటల్ డైలాగులు, ఇరత సందర్భాలకు అనుగుణంగా సంభాషణల రచనలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నలుగురైదుగురు రచయితలు ఈ సినిమా కోసం పనిచేసినట్టు సమాచారం.
గతంలో ఠాగూర్ సినిమాను వినాయక్ తీర్చిదిద్దిన తీరు మెగా ఫ్యామిలీకి బాగా నచ్చింది. అదికూడా తమిళ రీమేకే. అందులోనూ మురుగదాస్ సినిమానే. ఇప్పుడు కూడా తమిళ సినిమా కత్తి కూడా మురుగదాస్ సినిమానే. కథలో ఉన్న పవర్ ను ఉపయోగించుకుంటూనే కొత్తదనాన్ని, నేటివిటీని మిస్ కాకుండా వినాయక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట.
మెగాస్టార్ ఇమేజి, ఫ్యాన్స్ ఇమాజినేషన్, సాధారణ ప్రేక్షకుల అంచనాలు ఇలా చాలా విషయాలను దృష్టిలో పెట్టుకోవడం నిజంగా కత్తిమీద సామే. ఈ విషయంలో వినాయక్ కూడా కత్తిలాంటోడే అని సినిమా యూనిట్ అంటోంది. ఇంతకీ ఈ కత్తి ఎంత పదునుగా దిగుతుందో, బాక్సాఫీసును ఏ రేంజిలో షేక్ చేస్తుందో చూద్దాం.