సినిమాకు సగం బలం.. సంగీతమే. అందుకే దర్శక నిర్మాతలు సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. సినిమా సెట్స్‌కి వెళ్లక ముందే పాటల పని పట్టేవారు. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో దర్శకుడు, గీత రచయితలు, గాయనీ గాయకులు, హీరో, హీరోయిన్లు అంతా కూర్చుని పాటల కోసం చేసే కసరత్తు ఓ మధుర జ్ఞాపకంగా ఉండేది. ఇటీవల కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి ఆ విషయాల్ని గుర్తు చేసుకొన్నారు కూడా. ఇప్పుడు ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ అనే సంప్రదాయానికి చరమ గీతం పాడేశారు. స్వర కర్త ఎక్కడి నుంచో ట్యూన్ పంపితే, దర్శకుడు దాన్ని ఫోన్లో విని ఓకే చేస్తున్నాడు. గీత రచయిత గోవా బీచ్‌లో కూర్చుని పాట రాసి పంపితే, చెన్నైలో ఉన్న గాయకుడు దాన్ని పాడేస్తున్నాడు. ఇవన్నీ కలిపి రికార్డింగ్ స్టూడియోలో ఓ పాట తయారు చేస్తున్నాడు సంగీత దర్శకుడు. దాంతో మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్న మజా తెలీకుండా పోతోంది.
చాలా కాలం తరవాత… ‘విశ్వంభర’ కోసం టీమ్ అంతా కూర్చుని పాటలపై కసరత్తు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకొంటోంది. `విశ్వంభర` షూటింగ్‌కు ఇప్పుడు బ్రేక్ ఇచ్చింది చిత్రబృందం. ఈ బ్రేక్‌ని మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వాడుకొంటోంది. బెంగళూరులోని కీరవాణి ఫామ్ హౌస్ చిరంజీవి, కీరవాణి, దర్శకుడు వశిష్ట, గాయకుడు రాహుల్, రచయిత చంద్రబోస్ అంతా కలిసి సంగీత కచ్చేరీ చేస్తున్నారు. వారం రోజుల పాటు అక్కడే మకాం వేసి, పాటల పని పడతారు. ఆ తరవాత హైదరాబాద్ తిరిగొస్తారు. వచ్చాక పాటల్ని తెరకెక్కిస్తారు. చాలా కాలం తరవాత ఇలా టీమ్ అంతా కూర్చుని మ్యూజిక్ సిట్టింగ్స్ చేయడం చిత్రబృందానికీ కొత్త హుషారుని తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయనున్నారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయినట్టు టాక్.