అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు – శుభమస్తు సినిమా ఎలా ఉండబోతోంది?? ఈ ప్రశ్నకు సంబంధించి చిరంజీవి ఓ క్లూ ఇచ్చేశారు. ఇది బొమ్మరిల్లు లాంటి సినిమా అని డిక్లేర్ చేశారు. చిరంజీవి ఈ సినిమాని చూసేశారట. తనకు బాగా నచ్చిందని, దర్శకుడు ఈ సున్నితమైన కథని డీల్ చేసిన విధానం బాగుందని మెచ్చుకొన్నారు చిరు. తనకు ఈ సినిమా చూస్తున్నంత సేపూ బొమ్మరిల్లు సినిమా గుర్తొచ్చిందని, ఆ సినిమాలా శ్రీరస్తు శుభమస్తు కూడా హిట్టవ్వాలని కోరారు చిరు. శ్రీరస్తు – శుభమస్తు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు విచ్చేసి చిత్రబృందాన్ని అభినందించారు.
అన్నట్టు ‘శ్రీరస్తు శుభమస్తు’ టైటిల్ చిరంజీవిదే. ఈ పేరుతో చిరు గతంలో ఓ సినిమా చేశారు. అది బాగా ఆడింది కూడా. ఈ విషయాన్ని వేదికపై గుర్తు చేసుకొన్నారు చిరు. ‘ఇది నా టైటిల్ కాబట్టే సినిమాపై మరింత ప్రేమ పెరిగింది’ అని చెప్పుకొచ్చారు చిరు. తన మేనల్లుడు అల్లు శిరీష్‌ని మెచ్చుకొంటూనే.. లావణ్య త్రిపాఠి గ్లామర్‌కీ మార్కులేశారు. లావణ్య తన చిలిపిదనంతో ఈ సినిమాకి కొత్త అందాన్ని తీసుకొచ్చిందని, సోగ్గాడే చిన్నినాయిన సినిమాలో కంటే లావణ్య బాగుందని కితాబిచ్చాడు చిరు.