చిరంజీవిపై బీజేపీ అమితమైన ప్రేమను చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయాలకు అతీతమైన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొంటే… ఆ కార్యక్రమంలో పాల్గొనే అతిథుల జాబితాలో చిరంజీవి ఖచ్చితంగా ఉంటున్నారు. కేంద్రం నుంచి పలు గౌరవాలు అందుకుంటున్న చిరంజీవి తాజాగా.. ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లోనూ హైలెట్ అయ్యారు. తన ఇంట్లో జరిగే సంక్రాంతి వేడుకలకు కిషన్ రెడ్డి చిరంజీవిని ఆహ్వానించారు. ప్రధాని మోదీ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్నందున అతిధుల్లో చిరంజీవి ఉండాలని కిషన్ రెడ్డి అనుకున్నారు.
చిరంజీవిపై బీజేపీ ఇలాంటి అభిమానం చూపడం ఇదే మొదటి సారి కాదు. పలుమార్లు ఆయనపై ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. చిరంజీవి అంగీకరిస్తే ఆయనను రాజకీయాల్లోకి తీసుకు రావాలని అనుకుంటున్నారు. కానీ ప్రత్యక్ష రాజకీయాలపై చిరంజీవికి విరక్తి పుట్టేసింది. తాను వచ్చే ప్రశ్నే లేదంటున్నారు. గతంలో అనురాగ్ ఠాకూర్ ఈ అంశంపై నేరుగానే చిరంజీవిని ప్రశ్నించారు . కేంద్ర మంత్రి అడిగినా సరే చిరంజీవి అదే చెప్పారు. అయినా బీజేపీ అభిమానంలో ఏ మాత్రం మార్పు లేదు. చిరంజీవిని పాంపరింగ్ చేస్తున్నారా లేకపోతే.. మరో కారణం ఉందా అన్నది వారికే తెలియాలి.
కొద్ది రోజుల కిందట.. రాష్ట్రపతి కోటాలో చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలను సంపాదించిన వారిని ఈ కోటాలో రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజమౌళి తండ్రి , సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను అలాగే నామినేట్ చేశారు. ఈ సారి చాన్స్ ఇస్తే సినీ రంగం నుంచి చిరంజీవికి మించిన చాయిస్ ఉండదని భావిస్తున్నారు. బీజేపీ ప్రేమిస్తున్న తీరు చూస్తే.. ఇది నిజం అవుతుందన్న అభిప్రాయం ఎక్కువ మందికి కలుగుతోంది.