తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తరవాత… చిత్రసీమ విశాఖపట్నంకి తరలిపోతుందని అంతా భావించారు. అంతా కాకపోయినా, కొంతయినా అటువైపు షిఫ్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఏదీ జరగలేదు. సినిమాలకు కావల్సిన సరంజామా అంతా హైదరాబాద్‌లోనే ఉంది. ఆంధ్రాలో సినిమాలకు సంబంధించిన మౌళిక మైన వసతులు లేవు. అవి జరగాలంటే.. అక్కడ స్టూడియోల్ని స్థాపించాలి. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా స్టూడియోల్ని నిర్మించడానికి టాలీవుడ్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ శివార్లలో రామానాయుడు స్టూడియో ఉంది. దాన్ని మరింతగా అభివృద్ధి చేయడమో, లేదంటే.. మరో స్టూడియోని అక్కడ నిర్మించడమో చేయాలన్నది సురేష్ బాబు తాపత్రయం.
తాజాగా బాలకృష్ణ కూడా స్టూడియో నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని వార్తలొస్తున్నాయి. నిజానికి… బాలయ్య ఎప్పుడో విశాఖపై కన్నేశారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే స్టూడియో నిర్మాణానికి ఆయన అప్లికేషన్ పెట్టారు. స్టూడియో నిర్మాణానికి అనువైన స్థలం కేటాయించి ఇవ్వమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు బాలయ్య. కానీ.. ఓవైపు రాజధాని భూముల గొడవ, అమరావతి నిర్మాణం సమస్య.. ఇవి రెండూ చుట్టుముట్టేసరికి స్టూడియోల గురించి పట్టించుకోలేదు. ఆ తరవాత ప్రభుత్వం మారింది. బాలయ్య అప్లికేషన్ అలానే ఉండిపోయింది. ఇప్పుడు తాజాగా చిరంజీవి కూడా స్టూడియో నిర్మాణానికి భూములు కేటాయించమని జగన్ ప్రభుత్వాన్ని కోరారని సమాచారం. ఇప్పుడు జగన్ ముందు ఇవి రెండూ పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో జగన్ దేనికి ప్రాధాన్యం ఇస్తారన్న ఆసక్తి నెలకొంది. బాలయ్య అప్లికేషన్‌పై ఆయన సంతకం చేసే ప్రసక్తి ఉండదు. ఎందుకన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుకి స్టూడియో కేటాయిస్తే.. అంతకు ముందే అప్లయ్ చేసిన బాలకృష్ణని ఇగోని హర్ట్ చేసినట్టు అవుతుంది. ఇటీవల చిత్రసీమ నుంచి ఓ బృందం జగన్ ని కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టూడియోల ప్రస్తావన కూడా వచ్చినట్టు టాక్. జగన్ సీ.ఎం. అయిన తరవాత ఆయన్ని వ్యక్తిగతంగా కలుసుకున్న తొలి స్టార్ చిరునే. ఆ సమయంలోనూ స్టూడియో గురించి చర్చలు జరిపారని, జగన్ సానుకూలంగా స్పందించారని ఇన్ సైడ్ వర్గాల టాక్. మొత్తానికి విశాఖలో కొత్త స్టూడియోలు రాబోతున్నాయన్నది సుస్పష్టం. అయితే ఎవరికి ముందుగా జగన్ వరం అందిస్తారన్నది సస్పెన్స్.