ఈ సంక్రాంతి సంబరాల్ని రెట్టింపు చేశారు చిరంజీవి, బాలకృష్ణ. వీరిద్దరిలో సంక్రాంతి విజేత ఎవరు.. అంటూ బుర్రలు బద్దలు కొట్టున్నారంతా! ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు.. వీరిద్దరూ ఒకేసారి సత్తా చూపించి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించుకొన్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమాల ధాటికి ఈవారం కొత్త సినిమాలేం విడుదల కాలేదు. కనీసం ఆ ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేదు. ఇది ఈ స్టార్లకు కలిసొచ్చింది. కాస్త నెమ్మదించినట్టు అనిపించిన ఖైదీ, శాతకర్ణి వసూళ్లు ఈ వారంతంలో మళ్లీ పుంజుకొన్నాయి. శని, ఆది వారాల్లో మళ్లీ హోస్ ఫుల్ బోర్డులు కనిపించడంతో చిత్రబృందాల్లో సరికొత్త ఉత్సాహం నిండుతోంది. ఖైదీ నెం.150 వంద కోట్లు దాటిన తరవాత చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి వసూళ్లు వివరాలు చెప్పింది. శాతకర్ణి ఫిఫ్టీ అయ్యాక.. ఆ సమాచారాన్ని చిత్రబృందం మీడియాకు అందించింది. ఖైదీ నెం.150 గ్రాస్ రూ.150 కోట్లకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ముందే అంచనా వేశాయి. మధ్యలో ఆ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం కష్టం అనిపించింది. అయితే ఈవారం సినిమాలేం రాకపోవడం, వచ్చే వారం సింగం 3 తప్ప.. మరో సినిమా లేకపోవడంతో చిరు రూ.150 కోట్లు కొట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. శాతకర్ణి కూడా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతోంది. లెజెండ్ రికార్డుల్ని అన్ని చోట్లా తిరగరాస్తూ… దూసుకుపోతోంది. ఈ చిత్రం కనీసం రూ.80 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందని చిత్రబృందం ఊహిస్తోంది. సింగం 3 కాస్త అటూ ఇటూ అయితే… ఆ ఫిగర్ శాతకర్ణి ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.