బయోపిక్‌లను క్యాష్ చేసుకొనే మర్మం ఇప్పుడిప్పుడే కనిపెట్టించి చిత్రసీమ. దాంతో బాలీవుడ్లో జీవిత కథలు.. సినిమాలుగా మారే ప్రక్రియ ఊపందుకొంది. తెలుగునాట ఆ సంప్రదాయం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఎన్టీఆర్, పుల్లెల గోపీచంద్ జీవిత కథలు సినిమాలుగా మారుతున్నాయి. ఈ కోవలో చిరంజీవి జీవిత చరిత్ర కూడా సినిమాగా తీసే ఛాన్స్ ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దానికి తోడు సీనియర్ నటుడు బెనర్జీ కూడా… ఇందుకు వంత పాడుతున్నారు. చిరు జీవిత కథ సినిమాగా తీస్తే స్ఫూర్తివంతంగా ఉంటుందని, తనకి అవకాశం ఇస్తే… తానే ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని చెప్పుకొచ్చాడు బెనర్జీ.
సినీ స్టార్‌గా చిరుది అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఎదుగుదల. స్వయం కృషితో స్టార్‌గా ఎదిగిన వైనం.. అనితర సాధ్యం. అయితే… జీవిత కథని సినిమాగా తీయడానికి ఈ మేటర్ చాలదు. రాజకీయాల్లోనూ చిరు రాణిస్తే.. ప్రజల మనిషిగా ఎదిగితే… కచ్చితంగా చిరులో మరో కోణం చూపించే ఛాన్స్ ఉండేది. కానీ… రాజకీయంగా చిరు జీరో! హీరోగా తాను సంపాదించుకొన్న ఇమేజ్ కూడా… పాలిటిక్స్ తో డామేజ్ అయ్యిందన్న మాట నిజం. ఈ విషయాన్ని చిరు వీరాభిమానులూ అంగీకరిస్తారు. సినిమా నటుల విషయంలో చిరు స్ఫూర్తినిచ్చాడేమో… సామాన్య జనానికి కాదన్నది విశ్లేషకుల మాట. అలాంటి కథని సినిమాగా తీస్తే… రావల్సిన మైలేజీ వస్తుందా? ఓ క్రీడా కారుడి జీవితం తెరపై చూపిస్తే.. అంతో ఇంతో.. యువతరానికి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. సినీ స్టార్స్ విషయంలో ఇలాంటి అదనపు ప్రయోజనాలు కనిపించవు. అయితే ఎన్టీఆర్ జీవిత కథ అలా కాదు. ఆయన్ని సినిమాలకే పరిమితం చేయలేం. తెలుగువారి ఆస్తిగా మారిన… మనిషి. అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌లు తయారవుతున్నాయి కదా అని… చిరంజీవి బయోపిక్‌ల గురించి ఆలోచించకూడదు. బహుశా.. ఇలాంటి ప్రయత్నాలు జరిగినా.. చిరు అందుకు ససేమీరా అనే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి.