ఎవరీ చిరంజీవి?
ప్రశ్న చిన్నదే. సమాధానం సముద్రమంత పెద్దది.
తెరపై అతని బొమ్మ చూడ్డానికి వేచి చూసిన కళ్లు కథలు కథలుగా చెబుతాయి. చిరంజీవి అంటే ఏమిటో..?!
టికెట్ల కోసం క్యూలో నిలబడి అలసిన కాళ్లు, తెగిన చెప్పులూ, చిరిగిన చొక్కాలూ, తనవల్ల కాలగర్భంలో కలసిపోయిన రికార్డులు, కొత్తగా పుట్టుకొచ్చిన సంచలనాలూ పూస గుచ్చినట్టు వివరిస్తాయి. మాస్ మానియాకు మీనింగ్ ఎవరో?!
థియేటర్ల ముందు ప్రతిష్టించిన కటౌట్లు, ఇష్టంగా తలలు బద్దలు కొట్టుకొన్న కొబ్బరికాయలు, ప్రేమతో ఒళ్లు కాల్చుకొన్న హారతి కర్పూరాలూ విపులంగా వర్ణిస్తాయి. మెగా స్టార్ అనేది ఎందుకో..?!
స్వయంకృషిని డీకోడ్ చేస్తే వచ్చే పేరు… చిరంజీవి!
కష్టజీవికి కేరాఫ్ అడ్రస్స్… చిరంజీవి!!
అభిమానులకు అన్నయ్య
ఆపద అన్నవాళ్లకు ఆపద్బాంధవుడు
బాక్సాఫీసుకు ఘరానా మొగుడు
రికార్డుల గ్యాంగ్ లీడర్… అన్నింటికీ ఒక్కటే సమాధానం… చిరంజీవి!!!
చిరంజీవి అంటే రెండున్నర గంటల సినిమా కాదు. జీవిత కాల జ్ఞాపకం.
చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకొనే వెళ్లారు. కానీ చిత్రసీమకే కొత్త పాఠాలు నేర్పాడు చిరంజీవి. మాస్ సినిమా అర్థం మార్చి, కమర్షియాలిటీని హైవే ఎక్కించిన హీరోయిజం చిరంజీవి సొంతం. ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్, స్థాయి పెరిగిందని సంబరపడుతున్నాం కానీ, ఆ ప్రయాణానికి తొలి అడుగు వేసిన వాడు చిరంజీవి. తెలుగు సినిమాకు తొలి రూ.5 కోట్ల వసూళ్లు, తొలి పది కోట్ల అంకెలు చూపించింది చిరంజీవి. కోటి రూపాయల పారితోషికం అందుకొన్న తొలి హీరో చిరంజీవి. స్టార్ డమ్ లో, ఫ్యాన్ ఫాలోయింగ్ లో బాలీవుడ్ హీరోలకు మనవాళ్లూ ఏ మాత్రం తీసిపోరని నిరూపించిన వాడు చిరంజీవి. పాటలొస్తున్నాయంటే సీట్ల నుంచి పారిపోయే ‘సిగరెట్’ బ్యాచ్ కాళ్లకు సంకెళ్లు వేసి, కళ్లన్నీ వెండి తెరకే అంకితం చేయించి, తన స్టెప్పులతో తెలుగు సినిమాని ఎన్నో ‘స్టెప్పులు’ పైకి ఎదిగేలా చేసిన హీరో చిరంజీవి.
తెలుగు సినిమాని చిరంజీవికి ముందు, చిరంజీవి తరవాత అని రెండుగా విడగొట్టి చూస్తే, చిరు రాకతో సంభవించిన విప్లవాత్మక మార్పులు అర్థమవుతాయి. తాను ఎదగడమే కాదు, తన చుట్టూ ఉన్నవాళ్లని సైతం ఎదిగేలా తోడ్పాడు అందించాడు చిరు. చిరుని చూసి ‘మనం కూడా హీరోలైపోవొచ్చు’ అని ధైర్యం తెచ్చుకొని, హీరోలైపోయి, స్టార్ డమ్ సంపాదించుకొన్నవాళ్లు ఎందరో. ఆ హీరోల వెనుక ఉన్న అదృశ్య హస్తం చిరంజీవినే. మెగా కుటుంబం అని కుళ్లుకుంటారు కానీ, ఆ కుటుంబం చిత్రసీమకు దశాబ్దాలుగా వెన్నుదన్నుగా చిలిచిన సంగతి ఎవరూ మర్చిపోకూడదు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న తలపు… చిరుని మరింత ప్రత్యేకంగా నిలిపింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుల ద్వారా చేసిన సేవ, కరోనా సమయంలో చిత్రసీమనంతటినీ సంఘటిత పరిచి, ఆదుకొన్న విధానం అభిమానుకు ఎప్పటికీ గుర్తే.
Read Also :చిరుతో హరీష్… ఎక్కడి వరకూ వచ్చింది?
చిరు అందరి వాడే కానీ, అందనివాడు మాత్రం కాదు. సాధారణంగా చిరంజీవిలాంటి వ్యక్తుల్ని కలుసుకోవడానికి ఆపసోపాలు పడాల్సివస్తుంటుంది. కానీ చిరు అందరికీ అందుబాటులో ఉంటాడు. ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు సైతం చిరుని కలుసుకోగలరు. తనని ఎవరు కలిసినా పేరు పేరునా పలకరించే వ్యక్తిత్వం. ‘అన్నయ్యా..’ అంటూ అభయ హస్తం అందివ్వగలిగే మనస్తత్వం… చిరుని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాయి. చిత్రసీమలో ఇన్నేళ్లయినా మెగా కిరీటం ఆయనదే. ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా, ఈతరం హీరోలు ఎన్ని వెయ్యి కోట్ల సినిమాలు తీసినా – చిరు బ్లాక్ బస్టర్ సినిమాల ముందు దిగదుడుపే. చిరుని ఎంతో మంది ప్రేమించారు. ప్రేమిస్తూనే ఉంటారు. ఆఖరికి తనని ద్వేషించిన వాళ్లకు సైతం ప్రేమని పంచిపెట్టగలడం చిరుకి మాత్రమే సాధ్యం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్రసీమలోకి వచ్చి, తన చరిత తానే రాసుకొని, ఎంతోమందికి బ్యాక్ బోన్‌గా నిలిచిన చిరు.. ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టారే. భవిష్యత్తులో ఎంతమంది హీరోలొచ్చినా చిరుని రిప్లేస్ చేసే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే.. ఒకడే సూర్యుడు. ఒకడే చంద్రుడు. ఒకడే మెగాస్టార్.
(ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా)