పవన్ కల్యాణ్‌కు.. చిరంజీవికి మధ్య దూరం ఉందని ప్రచారం చేసి. చిరంజీవి తమకే అండగా ఉన్నాడని నమ్మించేందుకు వైసీపీ చేస్తున్న చీప్ ట్రిక్కులకు మెగాస్టార్ చిరంజీవి ఒకే ఒక్క స్టేట్మెంట్తో బుల్లెట్ దింపేశారు. ఇప్పుడు వైసీపీ కిందా మీదా పడుతోంది. తాము ఇంత కాలం మెగాస్టార్ పై చూపించిన అభిమానం అంతా.. ఫేక్ అని.. రాజకీయం కోసమే.. అలా చేస్తున్నామని వారే బయట పెట్టుకుంటున్నారు.
మెగా ఫ్యాన్స్ లో చిరంజీవి ద్వారా చీలిక తేవాలని వ్యూహం
జనసేన పార్టీని వైసీపీ చాలా తీవ్రంగా టార్గెట్ చేసింది. ఓ ప్రధాన సామాజికవర్గం పూర్తిగా వైసీపీకి దూరం జరుగుతుందన్న భావన పెరిగిపోవడంతో.. అందు కోసం చిరంజీవి తమ శ్రేయోభిలాషి అన్న ప్రస్తావన తీసుకు వస్తున్నారు. ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఘాటుగా విరుచుకుపడుతున్నారు. ఇలా విరుచుకుపడినప్పుడల్లా.. కొంత మంది వైసీపీ నేతలు చిరంజీవి ప్రస్తావన తీసుకు వచ్చి.. ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారన్నట్లుగా చెబుతున్నారు. కొంత మందితో పవన్ కల్యాణ్‌కు చిరంజీవి వ్యతిరేకం అన్న స్టేట్మెంట్లు కూడా చేయిస్తున్నారు. అంటే చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను అభిమానించేవారి లో చీలిక తీసుకు రావడమే లక్ష్యంగా వైసీపీ చేస్తున్న వ్యూహాన్ని పసిగట్టి చిరంజీవి ఇలా కౌంటర్ ఇచ్చారు.
చిరంజీవి ఖండించరని పోసాని, పేర్ని నాని వంటి వాళ్ల అతి ప్రకటనలు !
పవన్ కల్యాణ్ కారణంమగా చిరంజీవి చాలా మందికి సారీ చెబుతున్నారంటూ… పోసాని కృష్ణమురళీ ఓ ప్రకటన చేశారు. గతంలో పేర్ని నాని కూడా చిరంజీవి తరపున ప్రకటనలు చేశారు. మొహమాటంతో చిరంజీవి ఖండించరని వీరి వ్యూహం. వీరిదంతా చిరంజీవి ప్రో వైసీపీ అనే ఇమేజ్ ను నిర్మించాలనే తాపత్రయమే. ఇప్పుడు ఓ రకంగా ప్రభుత్వానికి .. వైసీపీకి చిరంజీవి మద్దతు దారు అన్న అభిప్రాయాన్ని బలవంతంగా కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడా బుడగ పేలిపోయింది. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చురుకుపుట్టించేవిగా ఉండటంతో ఇప్పటి వరకూ తాము చిరంజీవి ఫ్యాన్స్ అన్న వారంతా ఆయనపై విరుచుకుపడటం ప్రారంభించారు.
జనసేనకు ఇబ్బంది లేకుండా చిరంజీవి వ్యూహం
చిరంజీవి రాజకీయ వ్యాఖ్యలు చేసి చాలా కాలం అయింది. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని చాలా సార్లు ప్రకటించారు. వైసీపీ నేరుగా రాజ్యసభ స్థానం ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించారు. బీజేపీ హైకమాండ్.. ప్రధాని మోదీ స్థాయిలో చిరంజీవిని మోటివేట్ చేసేందుకు ప్రయత్నం చేసింది. కానీ చిరంజీవి తగ్గలేదు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానేరానని చెప్పారు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా తమ్ముడుకు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు కూడా అదే కోణంలో ఆయన ప్రకటన చేశారు. ఎవరు ఎంత పిసుక్కున్నా. ఇంకా రెచ్చగొడితే ఇలాంటి ప్రకటనలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటున్నారు.