చిరు సినిమాల ప్రమోషన్ల తీరు సంప్రదాయ బద్ధం గానే సాగుతుంటుంది. తన సినిమా విడుదల అవుతోంది అనగా.. ఫ్యాన్స్ మీట్ పెట్టీ.. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం చిరుకి అలవాటు. తన వారసుల విషయం లోనూ ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు. చరణ్ సినిమాకి ముందు ఫ్యాన్స్ మీట్ తప్పనిసరి అయ్యింది. బన్నీ, అల్లు శిరీష్ లు కూడా ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నారు. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సమయంలో చిరు ఫ్యాన్స్ మీట్ సంప్రదాయం యధావిధిగా కొనసాగింది.
ఇప్పుడు సైరా వస్తోంది. దాదాపు 250 కోట్ల పెట్టుబడి పెట్టారు. దాన్ని తిరిగి రాబట్టుకోవాలంటే ఓపెనింగ్స్ అదిరిపోవాలి. అందుకు ఫ్యాన్స్ సహకారం అత్యవసరం. అందుకే ఫ్యాన్స్ మీట్లు కూడా మళ్లీ మొదలయ్యాయి. జిల్లాల వారీగా అభిమానుల్ని చిరు కలుస్తున్నారు. ఈ నెల 22 చిరు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ నెల 21 న హైదరాబాద్ శిల్పారామంలో ఓ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ అతిథిగా రానున్నాడు. ఇది కూడా ఫ్యాన్స్ మీట్ లో భాగమే. రెండు తెలుగు రాష్ర్టాలలో వున్న చిరు ఫ్యాన్స్ కి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమం లో జనసేన అభిమానులు కూడా పాల్గొంటారని తెలిసింది. జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా పాల్గొననున్నారు.