ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిందని అనుకుంటారు కానీ.. చిరంజీవి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. నాటి ప్రజారాజ్యం పార్టీనే నేటి జనసేన అని స్పష్టం చేశారు. ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు జై జనసేన అని కూడా వ్యాఖ్యానించారు. అంటే చిరంజీవి మరి ఏ ఇతర పార్టీల వైపు కూడా చూసే అవకాశం లేదని సూపర్ స్పష్టత ఇచ్చినట్లయింది. చిరంజీవికి రాజ్యసభ అని.. మరొకటి అని విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. వాటన్నింటికీ చిరంజీవి చెక్ పెట్టినట్లయిందని అనుకోవచ్చు.
చిరంజీవి సినీ జీవితం ఎవరెస్ట్ లా ఉంటుంది. కానీ ఆయన రాజకీయ జీవితం మాత్రం డౌన్ గానే కనిపిస్తూ ఉంటుంది. పార్టీ పెట్టడం.. ఎన్నికల్లో పోటీ చేయడం సరైన ఫలితాలు రాకపోవడంతో మరో ఎన్నికను ఎదుర్కోకుండానే కాంగ్రెస్ లో కలిపేశారు. ఈ కారణంగా చిరంజీవి పొలిటికల్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఈ సంగతిని గుర్తించిన చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.కానీ ఆయన సోదరుడు మాత్రం ప్రజారాజ్యంపార్టీని మరో రూపంలో అంటే జనసేన రూపంలో ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. చిరంజీవి నేరుగా ప్రత్యక్షంగా సపోర్టు చేయనప్పటికీ ఆయన అభిమాన సంఘాలన్నీ జనసేనలో చేరాయి. సందర్భం దొరికినప్పుడల్లా సోదరుడు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలుపుతూనే ఉన్నారు.
పవన్ కల్యాణ్ కూటమిగా మారి సాధించిన అద్భుత విజయంతో చిరంజీవికి కూడా అనూహ్యమైనా గౌరవం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రత్యేకమైన గౌరవం ఇవ్వడం వెనక పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయం ఉందని అర్థం చేసుకోవచ్చు. తాను రాజకీయంగా ఫెయిలై ఉండవచ్చు కానీ.. ప్రజారాజ్యమే జనసేన రూపంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తోందని చిరంజీవి సంతృప్తి పడుతున్నారు. సోదరుడి పట్టుదల విషయంలో చిరంజీవి గర్వంగా ఉన్నారని అనుకోవచ్చు.