మెగా బ్రదర్స్ మధ్య మాటల్లేవ్ అన్నది మెగా అభిమానులు సైతం అంగీకరించేమాట. వాళ్ల మధ్య గొడవలేం లేవుగానీ.. అభిప్రాయ బేధాలు మాత్రం బలంగా ఉన్నాయి. చిరు గురించి పవన్‌ని అడిగినా, వవన్ ప్రస్తావన చిరు దగ్గర తీసుకొచ్చినా ఆ విషయం కూడా చూచాయిగా తెలిసిపోతుంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. మాటీవీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆదివారం చిరు పాల్గొన్నాడు. తన షో.. మీలో ఎవరు కోటీశ్వరుడు గురించి, ఆ అనుభవాల గురించీ చిరు ప్రస్తావిస్తున్నప్పుడు పవన్‌కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ”ప్రశ్నిస్తానంటూ ప్రజల్లోకి వెళ్లాడు పవన్.. మరి అతన్ని మీరు ఎప్పుడు ప్రశ్నిస్తాడు” అంటూ ఓ పాత్రికేయుడు నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి చిరు కాస్త అసహనం వ్యక్తం చేశాడు.
‘ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు మీలో ఎవరు కోటీశ్వరుడు గురించి మాట్లాడుకొందాం’ అంటూ… సమాధానం దాటేశాడు. నిజానికి ఆ ప్రశ్న కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు గురించే. పవన్‌ని హాట్ సీట్లో ఎప్పుడు కూర్చోబెడతారు? అనే ప్రశ్న… చిరుకి మరోలా వినిపించి ఉంటుంది. అందుకే… కాస్త చిరుబుర్రులాడేశాడు. బాలయ్యని తన షోకి ఆహ్వానిస్తానని చెప్పిన చిరు.. అదే స్పిరిట్ ఎందుకు చూపించలేకపోయాడో అర్థం కాదు. ప్రశ్న అర్థం కాలేదా? లేదంటే అర్థమైనా పవన్ ప్రస్తావన తీసుకురావడం చిరుకి నచ్చలేదా?? అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.