తెదేపా, భాజపాల గురించి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం కెవిపి రామచంద్ర రావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుతో తెదేపా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయిందని అన్నారు. ఒకవేళ భాజపా దానిని వ్యతిరేకిస్తే ఆ పార్టీ ఏపిలో తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఆ బిల్లుపై ఇవ్వాళ్ళ కాకపోయినా ఏదో ఒకరోజు తప్పకుండా ఓటింగ్ జరిగి తీరుతుందని తను భావిస్తున్నానని చిరంజీవి చెప్పారు.
ఆ బిల్లు, ప్రత్యేక హోదాల కారణంగా తెదేపా, భాజపాలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. వాటి బాద్యతల గురించి మాట్లాడేముందు చిరంజీవి తన బాధ్యతలని సక్రమంగా నిర్వరిస్తున్నానా లేదా అని ఆలోచించుకొంటే బాగుండేది. ఆయన రాజ్యసభ సభ్యుడు. అంటే పార్లమెంటులో రాష్ట్రానికి ప్రతినిధి అన్నమాట. కనుక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు విధిగా వాటికి హాజరయ్యి రాష్ట్ర సమస్యల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి, ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి హామీల అమలుగురించి కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. అందుకోసం ఆయన చాలా బారీగా జీతభత్యాలు కూడా తీసుకొంటున్నారు. కానీ ఆయన పార్లమెంటు సమావేశాలకి హాజరు కాకుండా సినిమా షూటింగ్ చేసుకొంటున్నారు. ఇవ్వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది కనుకనే సభకి హాజరయ్యారు లేకుంటే ఇవ్వాళ్ళ కూడా వచ్చి ఉండేవారు కారేమో? మరి అటువంటప్పుడు ఇతరులకి పాఠాలు చెప్పడం ఎందుకు?
హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం సాధ్యం కాదని తెలుస్తున్నప్పటికీ విభజన సమయంలో ఆయన దాని కోసమే వాదిస్తూ సమయం వృధా చేసారు. అదే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే హామీని విభజన చట్టంలో చేర్చేందుకు గట్టిగా కృషి చేసి ఉండి ఉంటే నేడు ఈ బిల్లు, ఓటింగ్ రెండూ అవసరం ఉండేవే కావు కదా? రాజకీయాలని, ప్రజాసేవని పార్ట్-టైంగా చేసుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ రాజ్యసభ సభ్యుడిగా జీతభత్యాలు తీసుకొంటూ తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే అందరూ వేలెత్తి చూపుతారు. సినిమాలలో చూపించే ఔదార్యం, హీరోయిజం, నీతి నిజాయితీ, ప్రజల పట్ల మమకారం అన్నీ నిజ జీవితంలో కూడా చూపగలిగితేనే ఎవరైనా నిజమైన హీరో అనిపించుకొంటారు.