మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఎదిగిన సినీ స్టార్. ఆయన కృషి పట్టుదల.. విజయాల గురించి ఎవరూ తక్కువ చేయలేరు. అందుకే ఆయనను లెజెండ్ అంటున్నారు. కేంద్రం దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ కూడా ఇచ్చింది. భారతరత్న కూడా ఇవ్వాలన్న సూచనలు ఉన్నాయి. ఇంతటి పేరు సంపాదించుకున్న ఆయన దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను కూడా మోసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఆయన పేరును పడగొట్టడానికి.. చెడగొట్టడానికి ఎప్పుడూ కొంత మంది రెడీగా ఉంటారు. వారి ట్రాప్‌లో పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది చిరంజీవే.
డ్యామేజ్ చేసిన సరదా సంభాషణలు
సినీ ప్రమోషన్ అంటే.. ప్రేక్షకుల. దృష్టిని ఆకర్షించడానికి చాలా చెబుతారు. తనకు ఎంతో ఆత్మీయుడైన బ్రహ్మానందం , ఆయన కుమారుడు కలిసి నటించిన సినిమా బ్రహ్మా ఆనందం కోసం ఆయన వెళ్లారు. అక్కడ కొన్ని మాటలు మాట్లాడారు మహిళలపైన.. తన తాతపైనా… తన కుటుంబ వారసత్వంపైనా ఆయన మాటలు మాట్లాడిన వివాదాస్పదం అయ్యాయి. నిజానికి ఆయన చాలా సరదాగా ఆ మాటలు మాట్లాడారు. సినీ ప్రమోషన్ కు తగినట్లుగా మాట్లాడారు. అంతే కానీ.. వివాదాస్పదం అవ్వాలని కాదు. తన వ్యక్తిత్వం అలాంటిదని చెప్పుకునే ఉద్దేశంతో కాదు.
ఎవరైనా కుటుంబాన్ని కించపర్చుకుంటారా ?
చిరంజీవి తన తాతను కించ పరిచినట్లుగా మాట్లాడారన్న అభిప్రాయం ఉంది. కానీ చిరంజీవికి టీం సరిగ్గా కన్వే చేయకపోవడం వల్లనే సమస్య పచ్చింది. తాత ఫోటో ప్రదర్శిస్తే మంచి ఎక్స్ పీరియన్స్ చెప్పాలని సరిగ్గా చిరంజీవికి కన్వే చేయలేకపోయారు. చిలిపి తాత స్టోరీ అనుకుని ఆయన అలా మాట్లాడి ఉంటారు. కానీ తప్పుగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. వారసత్వం విషయంలోనూ అంతే. ఇంటి నిండా మగ పిల్లలు ఉంటే.. ఓ ఆడపిల్ల ఉంటే బాగుండు అని అందరూ కోరుకుంటారు. అలాగే ఓ మగపిల్లాడు ఉంటే బాగుండు అని చిరంజీవి అనుకుని ఉండవచ్చు. అయన మెగాస్టార్ కావొచ్చు కానీ సగటు తండ్రి.. కుటుంబపెద్ద కూడా అనే సంగతి మర్చిపోవద్దు.
చిరంజీవి పబ్లిక్ స్పీచ్‌కు ముందస్తు ప్రిపరేషన్ బెటర్
చిరంజీవి ఇటీవలి కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎవరు వచ్చి అడిగినా వారిని ప్రోత్సహించేందుకు వెళ్తున్నారు. అది ఆయన మంచితనం. అయితే చిరంజీవి అంటే ప్రత్యేక అట్రాక్షన్ ఉంటుంది. ఆయన ఏమైనా తేడాగా మాట్లాడితే వివాదం చేస్తారు. అందుకే ఇలాంటి ఫంక్షన్స్ కు హాజరయ్యేటప్పుడు తన టీమ్ ద్వారా ముందస్తుగా ప్రిపేర్ కావడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆయన ఇమేజ్ కొండంతగా ఉంది. దాన్ని డ్యామేజ్ చేసేందుకు ఆయనే అవకాశం ఇవ్వకూడదు. దురదృష్టవశాత్తూ నేషనల్ మీడియాలోనూ ఇది హైలెట్ అయింది. ఇక ముందు అయినా జాగ్రత్తపడాలేమో ?