మైకు పట్టుకొంటే ఏదేనా మాట్లాడేయొచ్చా? వింటున్నారని ఎంతైనా చెప్పేయొచ్చా?? ఓ స్థాయి ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా ప్రజలు, మీడియా ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. ఆ మాటల్నే కొలమానాలుగా తీసుకొంటుంటుంది. అలాంటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆచి తూచి మాట్లాడాలి. పొగడ్తలకూ, ప్రసంశలకూ ఓ లిమిటేషన్ ఉంటుంది. ఇదంతా చిరుకి తెలియంది కాదు. అయినా.. ‘శతమానం భవతి’ సక్సెస్ మీట్లో.. ప్రకాష్‌రాజ్‌ని ఏకంగా ఎస్వీఆర్‌తో పోల్చాడు. ఇదెక్కడి పోలిక?? అంటూ సినీ విశ్లేషకులు అవాక్కవుతున్నారిప్పుడు.
ప్రకాష్‌రాజ్ మంచి నటుడు. ఆయన అందుకొన్న జాతీయ అవార్డులు ఆయన్ని ‘గొప్ప’ నటుడిగా మార్చాయి. కాకపోతే.. ఎస్వీఆర్‌తో పోలిక పెట్టేంత అద్భుతమైన నటుడేం కాదు. ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడే. కాకపోతే.. అతను చేసిన పాత్రలు చాలా పరిమితం. ఎస్వీఆర్‌లా.. కనీసం కైకాలలా ప్రకాష్‌రాజ్ ఎప్పుడైనా కరుణ రసాన్ని పండించాడా? పౌరాణిక పాత్రలు చేశాడా?? సెంటిమెంట్ అందించాడా? లేదే.. ఆయన పాత్రలన్నీ ఒకే గిరి గీసుకొని తిరిగాయి. అందులోనే తాను అద్భుతంగా నటించి ఉండొచ్చు గాక. ఎస్వీఆర్ అంటే ఓ మార్క్. అదో ఎవరెస్ట్. దాన్ని అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు.. భవిష్యత్తులో కాదు కూడా. ప్రకాష్ రాజ్‌లో అన్నీ బాగుంటాయి గానీ.. కెమెరా ముందు మనస్ఫూర్తిగా నవ్వలేడని, ఆ నవ్వు కృత్రిమంగా ఉంటుందని యండమూరి వీరేంద్రనాథ్లాంటి వాడే.. బాహాటంగా, అదీ ప్రకాష్ రాజ్ ముందు విమర్శించేశాడు. దానికి ప్రకాష్ రాజ్ దగ్గర కూడా సమాధానం లేకుండా పోయింది. అలాంటి నటుడ్ని.. ఎస్వీఆర్‌తో ఎలా పోల్చాలి?? ఎందుకు పోల్చాలి???
నటన పక్కన పెడితే.. వ్యక్తిత్వాన్నీ బేరీజు వేసుకోవాల్సివస్తుంది. ప్రకాష్‌రాజ్‌పై ఎన్ని వివాదాలున్నాయో లెక్కపెట్టేందుకు వీల్లేదు. చెప్పిన టైమ్‌కి సెట్‌కి రాడని, క్రమశిక్షణ లేదని, దర్శకులతో గొడవ పడతాడని, చెప్పాపెట్టకుండా షూటింగుల నుంచి వెళ్లిపోతాడని.. ఇలా రకరకాల రూమర్లు. ఇవన్నీ ప్రకాష్‌రాజ్‌లోని గొప్ప నటుడ్ని తక్కువ చేసే విషయాలే. ఇదంతా చిరుకీ తెలుసు. కానీ ఏదో పొగడాలని పొగిడేశాడంతే.
చిరునే కాదు.. ఇక ముందు ఎవరైనా, ఏ నటుడ్నయినా ఎస్వీఆర్ లాంటి దిగ్గజాలతో పోల్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని మనవి.