లైగర్ డిజాస్టర్ తరవాత పూరి జగన్నాథ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. పూరి కామ్‌గా ఉన్నాడంటే అర్థం ఖాళీగా ఉన్నాడని కాదు. తన గ్రౌండ్ వర్క్‌లో తాను బిజీగా ఉన్నట్టు. బాలీవుడ్ లో ఓ భారీ సినిమా చేయాలని పూరి ప్లాన్ చేశాడు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. తిరిగి టాలీవుడ్ హీరోతోనే సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. అందుకు గానూ.. పూరి ఇద్దరు హీరోలకు ఒకేసారి టచ్‌లోకి వెళ్లాడు పూరి.
ఓ మంచి కథ తీసుకురా, సినిమా చేస్తా – అని ఇది వరకే చిరంజీవి పూరికి మాట ఇచ్చాడు. మెగాస్టార్‌తో సినిమా చేయాలన్నది పూరి కల. ఇక పూరి ఎందుకు ఆగుతాడు? పైగా చిరు ఫామ్ లోకి వచ్చాడు. చిరుపై మాస్, కమర్షియల్ సినిమాలు ఇంకా వర్కవుట్ అవుతాయని వాల్తేరు వీరయ్య సినిమానే నిరూపించింది. అందుకే ఇప్పుడు పూరి చిరు కోసం ఓ మాస్ కథని రెడీ చేశాడు. చిరంజీవికి టచ్‌లోకి వెళ్లాడు. చిరు కూడా పూరితో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడు. అయితే ఒకటే కండీషన్. నెల రోజుల్లో పూర్తి స్క్రిప్టుతో రావాలని సూచించాడట. అంతే కాదు… 30 రోజుల కాల్షీటులోనే సినిమా పూర్తి చేయాలన్నది మరో కండీషన్. అంటే.. చిరు ఈ సినిమా కోసం కేవలం 30 రోజులే కేటాయించగలడన్నమాట. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు చిరు. ఇది పూర్తయిన వెంటనే పూరి సినిమా పట్టాలెక్కించాలన్నది చిరు ప్లాన్ కావొచ్చు. మరోవైపు బాలయ్యతో కూడా పూరి టచ్‌లో ఉన్నాడు. కానీ బాలయ్య ఫ్రీ అవ్వాలంటే టైమ్ పడుతుంది. ఎందుకంటే తన చేతిలో అనిల్ రావిపూడి సినిమా ఉంది. చిరు అయితే ఒకేసారి రెండు మూడు సినిమాల్ని సైతం పట్టాలెక్కించేస్తున్నాడు కాబట్టి… ఈసారికి పూరి చిరుకే ఫిక్సయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.