‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి గాను ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి కచ్చితంగా జాతీయ పురస్కారం రావాలని, వచ్చి తీరుతుందని నమ్ముతున్నానని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అన్నారు. సీతారామశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా చిరంజీవి ఆయన్ను కలిసి అభినందించారు.
సీతారామశాస్త్రిగారికి పద్మశ్రీ పురస్కారం ఎప్పుడో రావాల్సిందనీ, ఆలస్యమైనా అభిమానులు అందరూ ఆనందించేలా ఇప్పటికైనా పురస్కారం రావడం సంతోషమనీ అన్నారు. ‘సిరివెన్నెల’ను పద్మశ్రీ వరించడం వల్ల ఆ పురస్కారానికి వన్నె వచ్చిందన్నారు చిరంజీవి. మాటల మధ్యలో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా సంగతులూ పంచుకున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ “నేను హీరోగా నా తమ్ముడు నాగబాబు నిర్మించిన ‘రుద్రవీణ’లో పాటలకు శాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యం అందించారు. ‘తరలి రాద తనే వసంతం..’ వంటి పాటలన్నీ బావుంటాయి. అందులో సాహిత్యానికి సీతారామశాస్త్రిగారికి జాతీయ పురస్కారం రావలసింది. కానీ, ఒక్క ఓటు తేడాతో మిస్ అయ్యింది. ఈసారి ‘సైరా’తో ఆయనకు కచ్చితంగా పురస్కారం రావాలి. వస్తుందని నమ్ముతున్నా. సినిమాలో అన్ని పాటలూ సిరివెన్నెల గారే రాస్తున్నారు. ‘సైరా’కు ఆయనది సింగిల్ కార్డ్. ఇప్పటికే రాసిన రెండు పాటలు వింటుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది” అని అన్నారు.