మే 9తో జగదేకవీరుడు – అతిలోక సుందరి విడుదలై ముఫ్ఫై ఏళ్లు. అందుకే.. వైజయంతీ మూవీస్ ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల్ని అభిమానులతో పంచుకుంటోంది. అప్పుడప్పుడూ ఓ ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ వదులుతోంది. దానికి నాని గొంతు తోడైంది. ఇంకేముంది.. లాక్ డౌన్ వేళ బోలెడంత కాలక్షేపం. మధుర స్మృతుల్ని మరోసారి నెమరేసుకునే అవకాశం. ఈరోజు.. ఈ సినిమాకి సంబంధించిన పాటల గురించి కొన్ని ముచ్చట్లు బయట పెట్టాడు నాని. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. ఒక్కోపాట వెనుక ఒక్కో కథ.
ఇళయరాజా – వేటూరి మ్యాజిక్ ఎలా ఉంటుందో చెప్పిన సినిమా ఇది. అప్పటికి ఈ సినిమాలో పాటలన్నీ రెడీ. ఒక్క పాట తప్ప. దానికీ ఇళయరాజా అద్భుతమైన ట్యూను ఇచ్చేశారు. కానీ తీరా చూస్తే అది క్లాస్ ట్యూన్. `ఈ సినిమాలో ఉన్నవన్నీ క్లాస్ ట్యూన్లే కదా. చిరంజీవి లాంటి మాస్ హీరోని పెట్టుకుని ఒక్క మాస్ ట్యూనూ లేదేంటి` అని అశ్వనీదత్ బోల్డంత బెంగ పెట్టుకున్నారు. కానీ.. ట్యూన్ ని వదులుకోవాలని లేదు. అలాంటప్పుడే వేటూరి `మై హూ నా` అంటూ ముందుకొచ్చారు. `ఈ క్లాస్ ట్యూన్‌ని మాస్ పాటగా మార్చేస్తా` అంటూ శపథం చేశారు. అలా `అబ్బనీ.. తీయని దెబ్బ` పాట పుట్టుకొచ్చింది. ఆ ట్యూనూ, స్టెప్పులూ అన్నీ క్లాస్‌గానే ఉంటాయి. కానీ.. ఆల్ టైమ్ మాస్ గీతంగా నిలిచిపోయింది ఆ పాట.
థినక్కుతా.. కసక్కురో కి సంబంధించిన మరో ఫ్లాష్ బ్యాక్ ఉంది. చెన్నైలోని వాహిని స్టూడియోలో భారీ సెట్ వేశారు. ఆరోజే షూటింగ్ ఆఖరు రోజు. సాయింత్రానికి శ్రీదేవి బోంబే వెళ్లిపోవాలి. కానీ చిరంజీవికి మాత్రం 104 డిగ్రీల జ్వరం. ఈరోజు కాకపోతే.. రేపు షూటింగ్ చేసుకుందాం, అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. ఆ రోజు తప్పితే శ్రీదేవి మళ్లీ ఎప్పుడు దొరుకుతుందో? మరోవైపు రిలీజ్ డేట్ కూడా ఫిక్సయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 104 డిగ్రీల జ్వరంలో కూడా చిరంజీవి స్టెపులేసి అదరగొట్టేశాడు. సెట్లో ఓవైపు డాక్టర్లు, నర్సులు.. మరోవైపు చిరు స్టెప్పులూ. అలా ఆ పాట పూర్తయింది. ఇప్పుడు చూసినా ఆ పాట ష్రెష్గా ఉంటుంది. చిరంజీవికి అలసట మచ్చుకైనా కనిపించదు. అదీ.. మెగాస్టార్ అంటే.