150 సినిమాల చరిత్ర చిరంజీవిది.. మూడు దశాబ్దాల ప్రయాణం చిరంజీవిది. ఆయన అనుభవం.. చూసిన జీవితం ఇంతా అంతా కాదు. సినిమాలోని అన్ని విభాగాలపైనా చిరుకి పట్టుంది. చిరు సినిమాల్లో పాటలు, కాస్ట్యూమ్స్, మేనరిజమ్స్ ఇవన్నీ కొత్తగా ఉండడానికి కారణం.. చిరు వాటిపై పెట్టే ప్రత్యేక శ్రద్ధ. చిరుకి డైరెక్షన్లోనూ అనుభవం ఉంది. కొన్ని సినిమాలకు తెర చాటు దర్శకుడిగా పని చేశారు. కానీ.. అవన్నీ లోలోపల వ్యవహారాలు.
ఘరానా మొగుడు చిరు ఆల్ టైమ్ సూపర్ హిట్స్ లో ఒకటి. ఆ సినిమాలో కొంత భాగానికి చిరంజీవి దర్శకత్వం వహించారంటే నమ్ముతారా? ఆ రోజుల్లో ఆరు గంటలు దాటితే రాఘవేంద్రరావు సెట్స్ లో ఉండేవారు కాదట. రాఘవేంద్రరావు ఆరింటికి వెళ్లిపోయిన ప్రతీ రోజూ.. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు పూర్తి కాకపోతే… వాటికి చిరునే దర్శకత్వం వహించారు. అంతేకాదు.. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చాలా చిత్రాల్లో కొన్ని సన్నివేశాలకు చిరు దర్శకత్వం వహించారు. వారిద్దరి మధ్య అదో సెంటిమెంట్ గా మారింది.
బిగ్ బాస్ సమయంలోనూ ఇంతే. ఆ సినిమా దర్శకుడు విజయబాపినీడు. అనారోగ్య కారణాల వల్ల కొన్ని రోజులు విజయబాపినీడు సెట్ కి రాని పరిస్థితి. అప్పుడు కూడా చిరు ఘోస్ట్ డైకెర్టర్గా పనిచేశారు.
కానీ.. పూర్తి స్థాయి దర్శకత్వం అనే ఆలోచనే చిరంజీవికి రాలేదు. దానికి కారణం కూడా చెప్పారు చిరంజీవి. ”దర్శకత్వం చాలా పెద్ద బాధ్యత. కథానాయకుడిగా మరో పెద్ద బరువుని మోస్తూ, దర్శకత్వం వహించడం అంత తేలిక కాదు. మనకు చాలా గొప్ప దర్శకులున్నారు. వాళ్లని నమ్ముకుని, బాధ్యత వాళ్లపై పెడితే సరిపోతుంది. దర్శకత్వం నా గోల్ ఎప్పటికీ కాదు” అని చెప్పుకొచ్చారు చిరు.